ఎల్‌ఎల్‌ఎం అడ్మిషన్లపై ఆందోళన | - | Sakshi
Sakshi News home page

ఎల్‌ఎల్‌ఎం అడ్మిషన్లపై ఆందోళన

Jul 31 2026 12:45 AM | Updated on Jul 31 2026 12:45 AM

సాక్షి, వరంగల్‌ : కాకతీయ వర్సిటీ పరిధిలోని న్యాయ కళాశాలల ఎల్‌ఎల్‌బీ ఫైనల్‌ ఈయర్‌ విద్యార్థులు ఎల్‌ఎల్‌ఎం ప్రవేశాల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు మూడేళ్ల కోర్సు ఎల్‌ఎల్‌బీ ఫైనల్‌ ఈయర్‌ విద్యార్థుల ఆరో సెమిస్టర్‌, ఐదేళ్ల కోర్సు ఎల్‌ఎల్‌బీ ఫైనల్‌ ఈయర్‌ విద్యార్థుల పదో సెమిస్టర్‌ థియరీ పరీక్షలు జరుగుతుండగా, మరోవైపు ఎల్‌ఎల్‌ఎం అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతోంది. ఈ తరుణంలో రిజిస్ట్రేషన్‌కు అవసరమైన విద్యార్హత పత్రాలు సమర్పించలేని పరిస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు. కాకతీయ యూని వర్సిటీ ఎల్‌ఎల్‌బీ ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలను జూలై 29 నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహిస్తోంది. ఈ పరీక్షలు పూర్తయిన తర్వాతే జవాబు పత్రాల మూల్యాంకనం, ఫలితాల ప్రకటన, ప్రొవిజినల్‌ మెమోలు, లాంగ్‌ మెమోలు విద్యార్థుల చేతికి రానున్నాయి. అయితే దీనికంటే ముందే ఎల్‌ఎల్‌ఎం ప్రవేశ ప్రక్రియ కొనసాగుతోంది. మే 18న నిర్వహించిన పీజీఎల్‌ఎల్‌ఎం సెట్‌ ఫలితాలను జూలై 4న ప్రకటించారు. సుమారు 1,200 ఎల్‌ఎల్‌ఎం సీట్ల భర్తీకి సంబంధించిన తొలి విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు. ఇందులో భాగంగా అభ్యర్థులు టీసీ, ప్రొవిజినల్‌ మెమో, లాంగ్‌ మెమోలు వంటి ధ్రువపత్రాలను లాసెట్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తూ వెబ్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి జూలై 31 వరకు( శుక్రవారం) మాత్రమే గడువు ఉంది.

పరీక్షలు పూర్తికాకుండానే పత్రాలు ఎలా?

తెలంగాణ పోస్టు గ్రాడ్యుయేట్‌ లా కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (టీజీ పీజీఎల్‌సీఈటీ)లో అర్హత సాధించిన మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు ప్రస్తుతం పరీక్షలే రాస్తున్నారు. పరీక్షలు పూర్తికాకుండా ప్రొవిజినల్‌ మెమో, లాంగ్‌ మెమోలు జారీ కావడం సాధ్యం కాదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీసీ విషయంలో సెల్ఫ్‌ అటెస్టెడ్‌ అండర్‌టేకింగ్‌ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ, మార్కుల మెమోలు మాత్రం ఎక్కడి నుంచి తీసుకురావాలని ప్రశ్నిస్తున్నారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో వెబ్‌ ఆప్షన్ల నమోదు ఆగస్టు 1, 2 తేదీల్లో జరగనుండగా, ఆగస్టు 5న సీట్లు కేటాయించిన అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. ఈలోపు ఫైనల్‌ ఈయర్‌ ఫలితాలు వచ్చే అవకాశం లేదని, మంచి ర్యాంకులు సాధించినా ఎల్‌ఎల్‌ఎం సీటు కోల్పోయే ప్రమాదం ఉందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. విద్యా సంవత్సరం వృథా అయ్యే పరిస్థితి వస్తుందని వారు పేర్కొంటున్నారు.

అధికారులు న్యాయం చేయాలని

అభ్యర్థన..

‘ఉస్మానియా మినహా కేయూతోపాటు శాతవాహన, తెలంగాణ యూనివర్సిటీల్లోనూ ‘లా’ విద్యార్థులకు ఎల్‌ఎల్‌ఎం ప్రవేశాల విషయంలో ఇబ్బందులున్నాయి. తెలంగాణ ఉన్నత విద్యా మండలి అధికారులు జోక్యం చేసుకుని ‘లా’ విద్యార్థులకు న్యాయం చేయాలి. ఫైనల్‌ ఈయర్‌ ఫలితాలు విడుదలయ్యే వరకు అవసరమైన ధ్రువపత్రాల సమర్పణకు ప్రత్యేక అవకాశం కల్పించాలని, లేదా ఎల్‌ఎల్‌ఎం ప్రవేశాల తొలి విడత షెడ్యూల్‌ను వాయిదా వేయాలని’ కేయూలో ౖఫైనల్‌ ఈయర్‌ న్యాయ విద్యార్థి స్టాలిన్‌ కోరారు. అలా చేస్తే మాత్రమే అర్హత సాధించిన న్యాయ విద్యార్థులు ఉన్నత విద్యలో ప్రవేశించే అవకాశం ఉంటుందన్నారు. ఈ విషయమై తెలంగాణ ఉన్నత విద్యా మండలి అధికారి ఒకరిని వివరణ కోరేందుకు ఫోన్‌లో యత్నించగా అందుబాటులోకి రాలేదు.

కేయూలో ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు

ఒకవైపు.. సీట్ల నమోదు గడువు మరోవైపు

నేటితో ఎల్‌ఎల్‌ఎం రిజిస్ట్రేషన్‌కు ఆఖరు కావడంతో హైరానా

ప్రొవిజినల్‌ మెమో, లాంగ్‌ మెమోలు లేక వెబ్‌లో రిజిస్ట్రేషన్‌కు ఇబ్బందులు

ఉన్నత విద్యా మండలి జోక్యం

చేసుకుంటేనే స్టూడెంట్స్‌కు న్యాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement