కన్నాయిగూడెం : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలోని సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. వరద గంటగంటకూ పెరిగి ప్రవహిస్తోంది. ఎగువన భారీ వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లి గోదావరిలోకి వరద చేరుతోంది. దీంతో తుపాకులగూడెంలోని సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. బుధవారం 1,85,600 క్యూసెక్కుల నీటితో ప్రవహించిన గోదావరి.. గురువారం సాయంత్రం 6 గంటల వరకు 9,36,650 క్యూసెక్కులకు పెరిగింది. బుధవారం నుంచి ఇప్పటి వరకు ఆరు లక్షల పైచిలుకు క్యూసెక్కుల నీటి ప్రవాహం పెరిగింది. బ్యారేజీ వద్ద ఉన్న 59 గేట్లు ఎత్తి 9,34,344 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 82.5 మీటర్ల నీటి మట్టం కొనసాగుతోంది.
కాళేశ్వరం వద్ద ఉభయ నదుల పరవళ్లు..
కాళేశ్వరం: తెలంగాణ, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత ఉభయ నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 7.550 మీటర్ల ఎత్తులో నీటిమట్టం పుష్కరఘాట్లను తాకుతూ ఉధృతంగా దిగువకు తరలివెళ్తోంది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో 2,12,170లక్షల క్యూసెక్కులు ఉండగా, అదే స్థాయిలో అవుట్‌ఫ్లోను మొత్తం 85 గేట్లు ఎత్తి దిగువకు తరలిస్తున్నారు. బ్యారేజీ సామర్థ్యం 16.17టీఎంసీలు. గేట్లు ఎత్తడంతో వరద ప్రవాహం ఫ్రీగా తరలిపోతోంది. కాగా, అన్నారం బ్యారేజీ వద్ద ఎగువన గోదావరి గుండా 12,118 వేల క్యూసెక్కులు మాత్రమే తరలి దిగువ కాళేశ్వరం చేరుతోంది. అక్కడ ప్రాణహితతో కలిసి మేడిగడ్డకు తరలిపోతోంది.
సమ్మక్క సాగర్ వద్ద క్రమక్రమంగా
పెరుగుతున్న వరద
బ్యారేజీ వద్ద
9,36,650 క్యూసెక్కుల నీరు


