న్యూస్‌రీల్
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల నియామకంలో లొల్లి మొదలైంది. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కమిటీలు వేయాలని ఏఐసీసీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పదవుల పంపకాలు మొదలయ్యాయి. కాగా, డీసీసీ అధ్యక్షుల నియామకం నాటకీయ పరిణామాల మధ్య జరగగా.. మండల అధ్యక్షుల ఎంపికపై నాయకుల మధ్య సమాలోచన కనిపించడం లేదు. దీంతో జిల్లాకు వచ్చిన అబ్జర్వర్లు, స్థానిక ఎమ్మెల్యేలు ఆలోచించి తుది జాబితాను పీసీసీకి పంపించారు. అయితే అక్కడి నుంచి ఫైనల్ జాబితా వస్తేనే అధ్యక్షులు ఎవరనేది తేలుతుంది.
టీపీసీసీ వద్దకు జాబితా..
జిల్లాలోని 18 మండలాల కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక జాబితా టీపీసీసీ వద్దకు చేరినట్లు తెలిసింది. జిల్లాలో మహబూబాబాద్, డోర్నకల్ పూర్తిస్థాయి నియోజకవర్గాలు ఉండగా.. ఇల్లెందు, ములుగు, పాలకుర్తి నియోజకవర్గాల నుంచి రెండేసి మండలాలు జిల్లా పరిధిలో ఉన్నాయి. అయితే ఇందులో కొన్ని మండలాలకు ఒకరి పేరు, మరికొన్ని మండలాలకు ఇద్దరి నుంచి ఐదుగురి పేర్లు ఎంపిక చేసినట్లు ప్రచారం. ఇలా జిల్లా వ్యాప్తంగా మొత్తం 50కి పైగా నాయకుల పేర్లు రాసి పంపించారు.
కుదరని సయోధ్య..
ఎంత మంది అబ్జర్వర్లు వచ్చినా.. ఎంత మంది నాయకులు ఉన్నా.. స్థానిక ఎమ్మెల్యే చెప్పిందే ఫైనల్. అయితే ఎమ్మెల్యేలు సూచించిన నాయకులపై మరికొందరు అభ్యంతరాలు చెప్పారు. మరికొన్నిచోట్ల ఎంపీ బలరాం నాయక్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, మరికొన్ని మండలాల్లో మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా మండల అధ్యక్షుల ఎంపిక కోసం కొందరి పేర్లు సిఫారసు చేసినట్లు తెలిసింది. అయితే ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ, గంగారం మండలాలు, పాలకుర్తి నియోకవర్గంలోని తొర్రూరు, పెద్దవంగర మండలాల్లో ఏకాభిప్రాయం కుదిరినట్లు చెబుతున్నారు. అలాగే ఇల్లెందు నియోజకవర్గంలోని బయ్యారం, గార్ల మండలాల్లో ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రతిపాదించిన నాయకులపై స్థానికుల్లో కొందరు అభ్యంతరాలు చెప్పినట్లు తెలిసింది. అదే విధంగా ఆయా మండలాల్లో ఎంపీ బలరాం నాయక్ కొన్నిపేర్లు సూచించి వారికి మండల అధ్యక్ష పదవులు ఇవ్వాలని చెప్పిట్లు తెలిసింది. అదేవిధంగా మహబూబాబాద్ నియోజకవర్గంలోని నెల్లికుదురు, కేసముద్రం మండలాల్లో ఎమ్మెల్యే ప్రకటించిన పేర్లు కాకుండా మిగిలిన నాయకులు కొన్నిపేర్లు చెప్పి వారికి అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పినట్లు సమాచారం. అలాగే డోర్నకల్ నియోజకవర్గంలో కూడా కొన్ని మండలాలకు ఎమ్మెల్యే సూచించిన పేర్లు కాకుండా మరికొందరు నాయకులు పీసీసీకి కొందరి పేర్లతో కూడిన జాబితా ఇచ్చినట్లు ప్రచారం. దీంతో ఎప్పుడో చేపట్టాల్సిన మండల అధ్యక్షుల ఎంపికలో జాప్యం జరుగుతుందనే చర్చ.
అధిష్టానం ఆచితూచి..
మండల అధ్యక్షుల ఎంపికలో తుంగతుర్తితో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో జిల్లాలోని మండల అధ్యక్షుల ఎంపికలో తుది జాబితా ప్రకటించేందుకు పీసీసీ ఆచితూచి అడుగులు వేస్తుందని నాయకులు చెబుతున్నా రు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతిపాదించిన వారి లో కొందరు పార్టీలోకి కొత్తగా వచ్చిన వారు ఉంటే.. మరికొందరు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారు కూడా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నా యి. దీంతో నాయకులను ఒప్పించడంతో పాటు నియోజకవర్గాల్లో వివాదాలు లేకుండా చూసుకోవాలని ఎమ్మెల్యేలకు చెప్పినట్లు తెలిసింది. ఏది ఏమైనా పీసీసీ పరిశీలనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల జాబితా ఎప్పుడైనా వెలువడవచ్చని పార్టీ నాయకులు చెబుతున్నారు.
కొలిక్కిరాని కాంగ్రెస్ మండల అధ్యక్షుల నియామకం
స్థానిక ఎమ్మెల్యేలు, అబ్జర్వర్‌ల చర్చలు
కొన్ని మండలాల్లో సమాలోచనలు, మరికొన్నిచోట్ల పోటాపోటీ
టీపీసీసీకి చేరిన జిల్లా జాబితా


