● కలెక్టర్ స్నేహశబరీష్
మహబూబాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసి త్వరగా పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ స్నేహ శబరీష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం నుంచి అన్ని మండలాల ఎంపీడీఓలతో పాటు సంబంధిత అధికారులతో ఇందిరమ్మ ఇళ్లు, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిలో రాష్ట్రంలోనే జిల్లాను మొదటి స్థానంలో ఉంచేందుకు కృషి చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులు ఇళ్ల నిర్మాణాలపై లబ్ధిదారులను చైతన్యపర్చాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ పురుషోత్తం, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కెరీర్ గైడెన్స్ తరగతులు నిర్వహించాలి
కేసముద్రం: జిల్లాలోని అన్ని విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ తరగతులు నిర్వహించాలని కలెక్టర్ స్నేహశబరీష్ సూచించారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు, గిరిజన గురుకుల బాలికల పాఠశాలను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్స వం సందర్భంగా గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో కలెక్టర్ విద్యార్థినులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. అనంతరం పాఠశాలలోని వంటశాలను సందర్శించి, కూరలను పరిశీలించారు. సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులతో మాట్లాడారు. విద్యాబోధన, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంటర్ విద్య చాలా విలువైనదని, ఎవరూ కూడా నిర్లక్ష్యం వహించొద్దన్నారు. డిగ్రీ కళాశాలలో మొత్తం 16 మంది విద్యార్థులు, 16 మంది అధ్యాపకులు ఉండడాన్ని కలెక్టర్ గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీరోజు కాలేజీకి హాజరుకావాలని, గైర్హాజరైన విద్యార్థి తల్లిదండ్రులను పిలిచి మరీ కారణం తెలుసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ పురుషోత్తం, డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్, ఎంపీడీఓ క్రాంతి, ప్రిన్సిపాల్ సుజాత, సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సర్‌పై నిర్లక్ష్యం వహించొద్దు
మహబూబాబాద్ అర్బన్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై అధికారులు, బీఎల్‌ఓలు నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని 15వ వార్డులో కొనసాగుతున్న సర్ ప్రక్రియను సోమవారం కలెక్టర్ సందర్శించారు. సర్ ఫారాల సేకరణ, 100శాతం డిజిటలైజేషన్ పూర్తి చేయాలన్నారు. వార్డులో ప్రతీ ఇంటికి ఫారాలను అందజేయాలని, ఓటరు నుంచి అందిన ఫారాలను వెంటనే డిజిటలైజేషన్ చేసి రోజువారీగా పురోగతి నివేదిక సమర్పించాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ బానోతు బాబు, తహసీల్దార్ రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.


