ఓం నమఃశివాయ
సోమవారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు
● వైభవంగా మహాశివరాత్రి వేడుకలు
● అర్చనలు.. అభిషేకాలతో భక్తుల మొక్కులు
● జాగరణవేళ కిక్కిరిసిన ఆలయాలు
మహబూబాబాద్ రూరల్: మహాశివరాత్రి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. శివలింగ పూజలు, సామూహిక మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, బిల్వార్చన పూజలతో ఆలయాలు కిక్కిరిశాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాల్లో పా ర్వతీ పరమేశ్వరులను, శివలింగాలను దర్శించుకు ని పూజలు చేశారు. ఉమాచంద్రమౌళీశ్వరస్వామి దేవాలయం, పార్వతీ రామలింగేశ్వరస్వామి దేవా లయం, భక్త మార్కండేయ శివాలయం, స్వయంభూ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో అర్చకులు రంగావఝుల సుధాకరశాస్త్రి, చిట్టా శ్రీకాంత్ శర్మ, కొత్తూరి నర్సింహమూర్తిశర్మ, అన్నావఝుల యు గంధర్ శర్మ భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు. శివాలయాల్లో శివుడిని, పార్వతీదేవి అమ్మవారిని శోభాయమానంగా అలంకరించారు. మహాశివరా త్రి పర్వదినోత్సవాన్ని అత్యంత విశిష్టంగా భావించిన భక్తులు బిల్వ (మారేడు) దళాలు, తెల్లజిల్లేడు పూలు, జిల్లేడు ఆకులు సమర్పించి శివుడికి అలంకరణలు, అర్చనలు, పూజలు చేశారు.
వీరన్న సన్నిధికి పోటెత్తిన భక్తజనం
కురవి: మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆదివా రం భద్రకాళీ సమేత వీరభద్రస్వామి కల్యాణ బ్ర హ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణ మహోత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆలయ చైర్మన్ కొర్ను రవీందర్‌రెడ్డి, ఈఓ సత్యనారాయణలు కల్యాణ మహోత్సవ జాతరను పర్యవేక్షించారు. వేలాది మంది భక్తులు తరలిరావడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ఆలయ ఉత్తరద్వారం నుంచి మొదలుకొని నేరడ క్రాస్ రోడ్డు వరకు క్యూ ఏర్పడింది. ఆలయం ఎదుట నుంచి కల్యాణ మండపం వరకు కలకత్తా పండాల్స్(టెంట్లను) ఏర్పాటు చేయడంతో భక్తులు ఉపశమనం పొందారు. డీఎస్పీ తిరుపతిరావు పర్యవేక్షణలో రూరల్ సీఐ సర్వయ్య, కురవి ఎస్సై సతీష్ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్ ఆధ్వర్యంలో డాక్టర్ విరాజిత నేతత్వంలో వైద్య సేవలను అందచేశారు. మహబూబాబాద్ ఆర్టీసీ డిపో నుంచి కురవి వీరన్న జాతరకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపా రు. మహబూబాబాద్ నుంచి కురవికి, ఖమ్మం, సూ ర్యాపేటల నుంచి బస్సులు నడిచాయి. ఇదిలా ఉండగా.. కల్యాణ వీరభద్రుడు, భద్రకాళీ అమ్మవారి ఉత్సవ మూర్తులను వేర్వేరు శావల్లో ప్రత్యేకంగా అలంకరించి ఆలయంలో ప్రదక్షిణలు చేయించారు. గ్రామ పంచాయతీ వద్ద రెండు శావలు వేరుపడి.. గండిమైసమ్మ వద్ద ఎదురపడ్డాయి. వీరభద్రస్వామి, భద్రకాళీ అమ్మవారి తరపున గ్రామ పెద్దలు కూర్చొని కట్నకానుకలను మాట్లాడి ఎదుర్కోలు నిర్వహించారు. రాత్రి కల్యాణం నిర్వహించారు. వీరభద్రస్వామిని మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ దంపతులు, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు మాలోత్ నెహ్రూనాయక్ దర్శించుకున్నారు.
ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ


