పురాధీశులెవరు? | - | Sakshi
Sakshi News home page

పురాధీశులెవరు?

Feb 15 2026 9:38 AM | Updated on Feb 15 2026 9:38 AM

పురాధీశులెవరు?

పురాధీశులెవరు?

ప్రతిష్టకోసం ఎమ్మెల్యే.. కుమార్తె కోసం మాజీ ఎమ్మెల్యే

సాక్షి, మహబూబాబాద్‌: మున్సిపాలిటీ ఎన్నికల్లో జిల్లా ప్రజలు ఒక్కోచోట ఒక్కో విధంగా తీర్పునిచ్చారు. డోర్నకల్‌ నియోజకవర్గంలోని డోర్నకల్‌, మరిపెడ మున్సిపాలిటీలు కాంగ్రెస్‌, తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌ ఆధిక్యం సాధించాయి. దీంతో అక్కడ చైర్మన్‌ పీఠం పార్టీ నిర్ణయం మేరకు జరగనుంది. అయితే మొదటి నుంచి రూటేవేరు అనే విధంగా మానుకోట నియోకవర్గంలో మాత్రం ఓటర్లు ఇరుపక్షాలకు దాదాపుగా సమాన మద్దతు ఇచ్చారు. దీంతో మున్సిపల్‌ చైర్మన్ల ఎంపిక క్యాంపు రాజకీయాల చుట్టు తిరుగుతుంది.

ప్రతిష్టకోసం ఎమ్మెల్యే యత్నాలు

మహబూబాబాద్‌ నియోజకవర్గంలో ఉన్న మహబూబాబాద్‌, కేసముద్రం మున్సిపాలిటీల చైర్మన్ల ఎంపిక ప్రస్తుత ఎమ్మెల్యే మురళీ నాయక్‌, మాజీ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో 50వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచిన మురళీనాయక్‌ తనదైన శైలిలో జిల్లా కాంగ్రెస్‌ పదవిని తన సతీమని భూక్య ఉమకు దక్కించుకున్నారు. అయితే ఎమ్మెల్యే, పార్టీ అధ్యక్షురాలు ఒకే ఇంటి నుంచి ఉండటంతో ప్రతీ ఎన్నికలో పార్టీ ప్రతిష్టను కాపాడే బాధ్యత ఆ కుటుంబంపై మరింత పెరిగింది. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కన్నా ఎక్కువ సీట్లు గెలిచినా.. ఆశించిన స్థాయిలో గెలవలేదని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో డోర్నకల్‌ నియోజకవర్గంలోని డోర్నకల్‌, మరిపెడ రెండూ కాంగ్రెస్‌ ఖాతాలో వేసుకోగా.. మానుకోట నియోజకవర్గంలోని మహబూబాబాద్‌, కేసముద్రం చైర్మన్‌ స్థానాలను దక్కించుకుంటేనే ఇప్పటి వరకున్న విమర్శలకు సమాధానం చెప్పినట్లవుతుంది.

కుమార్తె కోసం మాజీ ఎమ్మెల్యే..

తెలంగాణ ఉద్యమకాలం నుంచి మానుకోటలోనే తిష్టవేసి రాష్ట్ర సాధన తర్వాత రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన శంకర్‌ నాయక్‌ గత ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అయితే ఎన్నికలు జరిగి రెండు సంవత్సరాలు గడవడంతో శంకర్‌ నాయక్‌ మానుకోటను వీడిపోతారనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారం చేసిన వాళ్లల్లో ప్రతిపక్ష పార్టీలతోపాటు, సొంత పార్టీ నాయకులు కూడా ఉండటం గమనార్హం. ఈ పరిస్థితిలో అందివచ్చిన మానుకోట మున్సిపాలిటీ చైర్మన్‌ రిజర్వేషన్‌ను కై వసం చేసుకునేందుకు తన కుమార్తె తేజశ్వినిని కౌన్సిలర్‌గా గెలిపించుకున్నారు. ఏ విధంగానైనా చైర్మన్‌ పీఠంపై కుమార్తెను కూర్చొబెట్టేందుకు ప్రయత్నాలు ము మ్మరం చేశారు. అదేవిధంగా కేసముద్రం మున్సిపాలిటీని కూడా దక్కించుకునేందుకు పార్టీ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

జిల్లాలోని మానుకోట, కేసముద్రం రెండు మున్సిపాలిటీల చైర్మన్‌ ఎన్నిక క్యాంపుల చుట్టు తిరుగుతుంది. కేసముద్రంలో మొత్తం 16 వార్డులు ఉండగా.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు సమానంగా చెరో ఎనిమిది స్థానాలు దక్కాయి. దీంతో క్యాంపు రాజకీయంతోపాటు ఎక్స్‌అఫీషియా ఓట్లపై ఆయా పార్టీలు దృష్టిసారించాయి. మానుకోటలో కాంగ్రెస్‌ పార్టీ తన మిత్రపక్షం సీపీఎంను కలుపుకొని 16 వార్డులు, బీఆర్‌ఎస్‌ మిత్రపక్షం సీపీఐని కలుపుకొని 15 వార్డులు గెల్చుకున్నాయి. ఒక వార్డు స్థానంలో గెలుపొందిన భారతీయ జనతా పార్టీ తటస్థంగా ఉండడంతో నాలుగు వార్డులు గెల్చుకున్న స్వతంత్ర అభ్యర్థుల నిర్ణయం కీలకం కానుంది. వారిని తమ వైపు తిప్పుకునేందుకు క్యాంపులు ఏర్పాటు చేశారు. గెలిచిన స్వతంత్ర అభ్యర్థులు కాంగ్రెస్‌ క్యాంపులో ఉండగా.. వారి బంధువుల వద్దకు వెళ్లి భారీగా నజరానాలు ఇస్తామని మద్దతు తెలుపాలని బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇటువంటి పరిస్థితిలో ఇండిపెండెంట్‌ అభ్యర్థులు ఎవరికి మద్దతిస్తారు.. పురాధీశులు ఎవరవుతారో వేచిచూడాలి.

క్యాంపు రాజకీయం

మానుకోట మున్సిపల్‌ పీఠానికికాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పట్టు

చైర్మన్‌ ఎన్నికలో కీలకం

కానున్న స్వతంత్రులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement