స్వతంత్రులు ఎటువైపు..?
మహబూబాబాద్: మానుకోట మున్సిపాలిటీలో పోలైన ఓట్ల మోజార్టీలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ తర్వాత స్థానంలో స్వతంత్రులే ఉన్నారు. పలు వార్డుల్లో స్వతంత్రుల ద్వారా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. వారికి పడిన ఓట్ల ద్వారా కొన్ని వార్డుల్లో బీఆర్‌ఎస్‌కు మేలు జరగ్గా పలు వార్డుల్లో కాంగ్రెస్‌కు కలిసొచ్చింది. చివరికి చైర్మన్ విషయంలోనూ స్వతంత్రులే కీలకంకావడం గమనార్హం. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన వారే స్వతంత్రులుగా పోటీ చేసి గెలుపొందడం చర్చనీయాంశంగా మారింది.
స్వతంత్రులకు 7,005 ఓట్లు
మానుకోట మున్సిపాలిటీలో మొత్తం ఓటర్లు 65,712 మంది ఉండగా 49,661 ఓట్లు పోలయ్యాయి. వాటిలో ఓట్లను పరిశీలిస్తే కాంగ్రెస్‌కు 17,070 ఓట్లు, బీఆర్‌ఎస్‌కు 18,483 ఓట్లు, స్వతంత్రులకు 7,005 ఓట్లు వచ్చాయి. బీజేపీ 1,270, సీపీఐ 2602, సీపీఎం 2799 ఓట్లు సాధించాయి. బీఆర్‌ఎస్ తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత స్థానంలో స్వతంత్రులకే ఎక్కువ ఓట్లు పోలైనట్లు ఎన్నికల సిబ్బంది ప్రకటించారు. 36 వార్డులకు గాను 38 మంది స్వతంత్రులు బరిలో నిలిచారు. 11వ వార్డుతోపాటు పలు వార్డుల్లో స్వతంత్రులు రెండో స్థానంలో ఉన్నారు.
కాంగ్రెస్ చైర్మన్ ప్రతిపాదిత అభ్యర్థి ఓటమి
కాంగ్రెస్ పార్టీకి చెందిన చైర్మన్ ప్రతిపాదిత అభ్యర్థి మూడ్ బాలుచౌహన్ 17వ వార్డు నుంచి పోటీ చేయగా ఓటమి పాలయ్యారు. దీంతో నాల్గో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన గుగులోత్ జ్యోతి తెరపైకి వచ్చారు. ఆమె కూడా కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. గెలిచిన నలుగురు స్వతంత్ర అభ్యర్థులూ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే కావడంతో కాంగ్రెస్ పార్టీకే మద్దతిస్తారనే ధీమాతో ఆపార్టీ నేతలు మంతనాలు చేస్తున్నారు. ఈక్రమంలో కాంగ్రెస్‌కు చైర్మన్, సీపీఎంకు వైస్ చైర్మన్ పీఠం దక్కనున్నట్లు తెలుస్తుంది. ఇక స్వతంత్రులు బీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపితే బీఆర్‌ఎస్‌కు చైర్మన్, సీపీఐకి వైస్ చైర్మన్ దక్కే అవకాశం ఉంది. స్వతంత్రులు, ఎక్స్ అఫీషియో ఓట్లపైనే చైర్మన్ ఎన్నిక ఆధారపడి ఉండడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.
పోలైన ఓట్ల మెజార్టీలో వారికి మూడోస్థానం
చైర్మన్ పీఠంలోనూ కీలకంగా మారిన వైనం
గెలుపోటములపై ఇండిపెండెంట్ల ప్రభావం
స్వతంత్రులే కీలకం
ఎన్నికల్లో కాంగ్రెస్ , సీపీఎం కలిసి పోటీ చేయగా కాంగ్రెస్ 13 వార్డుల్లో సీపీఎం 3 వార్డుల్లో విజయం సాధించాయి.
బీఆర్‌ఎస్, సీపీఐ స్నేహపూర్వక పొత్తుతో బీఆర్‌ఎస్ 11 వార్డుల్లో సీపీఐ 3 వార్డుల్లో గెలుపొందాయి.
కాంగ్రెస్, సీపీఎం కలిపి 16సీట్లు ఉండగా బీఆర్‌ఎస్ సీపీఐ కలిపితే 14 ఉన్నాయి. కాగా మూడో వార్డు నుంచి గెలిచిన స్వతంత్ర అ భ్యర్థి కె.రజిత బీఆర్‌ఎస్ మద్దతుతో విజ యం సాధించడంతో వారి బలం 15కు చే రింది. చైర్మన్ స్థానం దక్కాలంటే 19 ఓట్లు అవసరం ఇందుకోసం పూర్తి మెజార్టీ ఏపార్టీకి రాకపోవడంతో స్వతంత్రులు కీలకమయ్యారు. 4వ వార్డుకు చెందిన గుగులోత్ జ్యోతి, 13వ వార్డుకు చెందిన కాటా భాస్క ర్, 28వ వార్డుకు చెందిన బోల్లు రాజు, 30వ వార్డుకు చెందిన గాడిపెల్లి లావణ్య కీలకమయ్యారు. దీంతో వారి మద్దతుకోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రయత్నాలు చేస్తున్నాయి.


