వీరన్న సన్నిధిలో ఎస్పీ పూజలు
కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత శ్రీవీరభద్రస్వామిని ఎస్పీ శబరీష్ శనివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈఓ సత్యనారాయణ, చైర్మన్ కొర్ను రవీందర్‌రెడ్డి స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాలు అందజేశారు. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంత రం ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులతో జాతరపై చర్చించారు. పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ధర్మకర్తలు బాలగాని శ్రీనివాస్, చిన్నం గణేష్, డీఎస్పీ తిరుపతిరావు, సీఐ సర్వయ్య పాల్గొన్నారు.
ధ్వంసమైన పుష్కరఘాట్ పరిశీలన
మంగపేట: మండల కేంద్రంలోని పొదుమూరు సమీపంలో గోదావరి ఒడ్డున 2015లో పుష్కరఘాట్ నిర్మించారు. గోదావరి వరదలకు ధ్వంసమైన ఈ ప్రాంతాన్ని ఇరిగేషన్ ఈఈ శంకరయ్య రెవెన్యూ పంచాయతీ అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2027 జూన్‌లో జరుగనున్న గోదావరి పుష్కరాలకు పుష్కరఘాట్ ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసేందుకు స్థల పరిశీలనకు వచ్చినట్లు వెల్లడించారు. 2015లో పుష్కరాల సందర్భంగా రూ.5.64 కోట్లతో 170 మీటర్ల మేర నిర్మించిన పుష్కరఘాట్‌ను పరిశీలించినట్లు తెలిపారు. మండలంలో 2027 జూన్‌లో జరిగే పుష్కరాలకు పుష్కరఘాట్ ఏర్పాటు చేసేందుకు ఈ నెల 18న ఉన్నతాధికారులు అనుకూలమైన స్థలాన్ని పరిశీలించేందుకు మండలానికి రానున్నట్లు వివరించారు. ముందస్తుగా అనుకూలమైన స్థలాన్ని గుర్తించేందుకు పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం గోదావరి కరకట్ట నిర్మాణం జరుగుతున్నా దొంగల ఒర్రె ప్రాంతాన్ని కూడా పరిశీలించినట్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పుష్కరఘాట్ ఏర్పాటుకు స్థలాన్ని నిర్ణయించనున్నట్లు వివరించారు. ఇరిగేషన్ డీఈ రవికుమార్, ఏఈ వలీమ్‌మహ్మద్, జీపీఓ రాములు, నర్సయ్య, సురేశ్ పాల్గొన్నారు.
కంప్యూటర్ సైన్స్ బీఓఎస్‌గా రమేశ్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ విభాగం బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా (బీఓఎస్) అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రమేశ్‌ను నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు బీఓఎస్‌గా పనిచేసిన డాక్టర్ మంజుల పదవికాలం ముగియడంతో రమేశ్‌ను నియమించారు. బాధ్యతలు స్వీకరించిన ఆయన ఈ పదవిలో రెండు సంవత్సరాలపాటు కొనసాగనున్నారు.
కాజీపేటలో రైల్వేట్రాక్ మరమ్మతు పనులు
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్‌లో శనివా రం రైల్వే ఇంజనీరింగ్ అధికారులు రైల్వేట్రాక్ మరమ్మతు పనులు చేపట్టారు. కాజీపేట రైల్వే స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంలో రైల్వేట్రాక్ కాలపరిమితి పూర్తి అయ్యింది. ఆ స్థానంలో కొత్త రైల్వేట్రాక్ (ట్రాక్ రెల్ రిప్లస్) పనులు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. గతంలో ఒక రైలు పట్టా 13 మీటర్ల వరకు ఉండేద ని, ప్రస్తుతం ఎలాంటి జాయింట్ లేకుండా 200 మీటర్ల వరకు రైలు పట్టా ఉంటుందని పేర్కొన్నారు. అధునాతన రైళ్ల వేగాన్ని తట్టుకునేందుకు ఈ ట్రాక్ వేస్తున్నట్లు తెలిపారు. వారం రోజుల నుంచి ఇంజనీరింగ్ స్టాఫ్, యంత్రాలతో ట్రాక్ రెన్యువల్ పనులు చేపడుతున్నట్లు రైల్వే అధికారులు వివరించారు.
వీరన్న సన్నిధిలో ఎస్పీ పూజలు


