క్షణ క్షణం ఉత్కంఠ!
ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద మద్దతుదారుల కోలాహలం
● పలు స్థానాల్లో నువ్వా నేనా అన్నట్లు సాగిన కౌంటింగ్
● గెలుపోటములపై అంచనాలు తారుమారు
● ముగిసిన ఓట్ల లెక్కింపు, విజేతల ప్రకటన
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగింది. శుక్రవారం ఉదయమే అభ్యర్థులు, వారి అనుచరులు లెక్కింపు కేంద్రం ముందు భారీగా వచ్చి చేరడం.. లోపల నుంచి ఎప్పుడు ఏ సమాచారం వస్తుందో అని ఎదురు చూడడం.. మెజార్టీ వచ్చిందనే వార్తలు రాగానే కేరింతలు, నినాదాలతో హోరెత్తించారు.
వంద ఓట్లకు ఒక కట్టా..
రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కౌంటింగ్ కేంద్రాల్లో ప్రతీ వార్డుకు ఒక టేబుల్ ఏర్పాటు చేశారు. ఈ టేబుల్‌కు రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, కౌంటింగ్ సూపర్ వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లు సిద్ధం చేసుకున్నా టేబుల్స్‌పై ఉదయం 8 గంటలకే లెక్కింపు మొదలు పెట్టారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ పత్రాలు తెరిచి అభ్యర్థుల వారీగా వచ్చిన ఓట్లను ప్రకటించారు. తర్వాత వార్డులోని ఓటర్లను గుర్తుల వారీగా వంద ఓట్లు ఒక కట్టగా కట్టి వేరు చేశారు. తర్వాత కట్టలను లెక్కించి.. మోజార్టీతో పాటు విజేతలను ప్రకటించారు.
స్వల్ప మెజారిటీతో కొందరు..
జిల్లాలోని మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, కేసముద్రం, డోర్నకల్ మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా కొందరు అధిక మెజార్టీతో గెలుపొందగా.. మరికొందరు మాత్రం నరాలు తెగే ఉత్కంఠ మధ్య గెలుపొందారు. ప్రధానంగా మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 26వవార్డు నాలుగు ఓట్ల మెజార్టీ, 28వ వార్డు ఆరు ఓట్ల మెజార్టీ, 11వ వార్డు పది ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మరిపెడ మున్సిపాలిటీలోని 8వ వార్డులో ఆరు ఓట్ల మెజార్టీతో అభ్యర్థి గెలిచారు.
క్షణ క్షణం ఉత్కంఠ!


