క్యాంపు రాజకీయాలు
– IIలోu
సాక్షి, మహబూబాబాద్: మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. తెల్లవారితే ఫలితాలు వస్తాయి. ఈ తంతు ముగిసిన వెంటనే అసలు కథ మొదలవుతుంది. అదే చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక. అభ్యర్థులు ప్రలోభాలకు గురికాకుండా ఉండేందుకు క్యాంపులకు తరలించే ప్రయత్నంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నాయకులు సిద్ధం అవుతున్నారు. అయితే ఇప్పటికే ఇరు పార్టీల నాయకులు అభ్యర్థులను పిలిపించుకొని సుదీర్ఘ చర్చలు జరిపారు. పార్టీ నిర్ణయం మేరకు కట్టుబడి ఉండాలని సూచించారు.
ప్రతీచోట పోటాపోటీ..
జిల్లాలోని మహబూబాబాద్, తొర్రూరు, మరిపె డ, డోర్నకల్, కేసముద్రం ఐదు మున్సిపాలిటీల్లో ఏ ఒక్క మున్సిపాలిటీ కూడా ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఉంటుందనే మాట రావడం లేదు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సరిసమానంగా వార్డులు గెలిచే అవకాశం ఉంది. ఇరు పార్టీల రెబల్స్, స్వతంత్ర అభ్యర్థులతోపాటు, వామపక్ష పార్టీల అభ్యర్థులు కూడా పలుచోట్ల గెలిచే అవకాశం ఉంది. దీంతో చైర్మన్ అభ్యర్థి ఎంపికలో నువ్వా.. నేనా అన్నట్లు ఉంటుంది. అదే విధంగా తొర్రూరు, మరిపెడ, డోర్నకల్, కేసముద్రంలో స్వతంత్ర అభ్యర్థుల ఓటు మీదనే చైర్మన్ ఎంపిక ఆధారపడి ఉండే అవకాశం ఉంది. దీంతో ఎప్పుడు ఏ పరిణామం చోటుచేసుకుంటుందో అనే ఉత్కంఠ నెలకొంది.
ఫలితాలు వచ్చేవరకు సమీపంలో..
ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే గెలుపు, ఓటమి చెందిన అభ్యర్థుల సంతకాలు తీసుకొని గెలిచిన వారికి పత్రం అందజేస్తారు. అయితే గురువారం రాత్రి ఐదు మున్సిపాలిటీల కాంగ్రెస్ అభ్యర్థులను బస్సులో జిల్లాకు సమీపంలో ఉన్న డెన్‌కు తీసుకెళ్లి అక్కడ రాత్రి బస చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే కౌంటింగ్ సెంటర్లకు తీసుకువచ్చి అధికారి సమక్షంలో సంతకం చేసి గెలుపొందిన పత్రం తీసుకుంటారు. ఆ తర్వాత దూర ప్రాంతాలకు వెళ్లి చైర్మన్, చైస్ చైర్మన్ నియామకంపై ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత సమయానికి వచ్చి ఓటింగ్‌లో పాల్గొని మున్సిపాలిటీల చైర్మన్, వైస్‌చైర్మన్‌ను ఎంపిక చేస్తారు. ఇందుకోసం ఇప్పటికే పదిరోజులకు సరిపడా దుస్తులు, దుప్పట్లు, బీపీ, షుగర్, మొదలైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మందులు తీసుకొని సిద్ధంగా ఉండాలని చెప్పారు. అయితే బీఆర్‌ఎస్ నాయకులు మాత్రం ముందుగా అందరితో మాట్లాడి విప్ జారీ చేసి సంతకాలు తీసుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ నుంచి మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు క్యాంపుల ఏర్పాటులో నిమగ్నమయ్యారు. క్యాంపు ఎక్కడ పెట్టాలి. పుణ్యక్షేత్రాలకు వెళ్లాలా.. గోవా, విశాఖపట్నం, మైసూర్, బెంగళూర్ వంటి ప్రాంతాలకు వెళ్లాలా అనే విషయంపై మెజార్టీ అభ్యర్థుల నిర్ణయం తీసుకుంటున్నారు. ఏది ఏమైనా.. ఎన్నికల ఫలితాల్లో ఐదు మున్సిపాలిటీలకు చెందిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం, స్వతంత్రుల్లో గెలుపొందిన వారు ఏ ఒక్కరు కూడా మున్సిపాలిటీల్లో ఉండే అవకాశం కనిపించడం లేదు.
అభ్యర్థులను తరలించేందుకు ఏర్పాట్లు
దుస్తులు సర్దుకొని ఉండాలని సూచన
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల బిజీ
చైర్మన్ ఎంపిక కోసం ఇప్పటి నుంచే ప్యూహం


