మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
● 1,100 మంది పోలీసులతో బందోబస్తు
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
వరంగల్ క్రైం: మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేటలో బుధవారం జరిగే మున్సిపల్ ఎన్నికల బందోబస్తు కోసం 1,100 మందికిపైగా పోలీసులను నియమించినట్లు పేర్కొన్నారు. ఇందులో ముగ్గురు డీసీపీలు, ఐదుగురు అదనపు డీసీపీలు, ఏసీపీలు 11 మంది, ఇన్‌స్పెక్టర్లు 125 మంది, ఎస్సైలు 113 మంది, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు 515 మంది, హోంగార్డులు 226 మంది, జిల్లా గార్డులు, బాంబ్ డిస్పోజబుల్ విభాగాలకు చెందిన సుమారు 168 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. అదనపు డీసీపీ స్థాయి పర్యవేక్షణలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ నియమించామని, ప్రతీ మున్సిపల్ పరిధిలో ఒక ఏసీపీ స్థాయి అధికారి ఇన్‌చార్జ్‌గా ఉంటారని ఆయన తెలిపారు. రూట్ మొబైల్ టీంలు, షాడో పార్టీలు, ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఒక ఎస్సై, ఏఎస్సైతో పాటు హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు విధులు నిర్వర్తిస్తారని, మొబైల్ పార్టీలు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తాయని పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఎవరైనా ఎన్నికల నిర్వహణకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడుతున్నట్లు సమాచారం అందితే తక్షణమే పోలీసులకు తెలియజేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు. కాగా, సీపీ సన్ ప్రీత్ సింగ్ హనుమకొండ జిల్లా పరకాల, జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించి సిబ్బందికి సూచనలిచ్చారు.


