విలీనం.. అభివృద్ధికి దూరం
అంతర్గత రోడ్లు లేని బేతోలు గ్రామం
సీసీరోడ్లు లేని రజాలిపేట గ్రామం
మహబూబాబాద్ మున్సిపాలిటీ విలీన గ్రామాల్లో సమస్యల తాండవం
ఎనిమిదేళ్లుగా పరిష్కారానికి
నోచుకోని వైనం
ఇరుకు గల్లీలు.. దెబ్బతిన్న రోడ్లు
సైడ్ కాల్వలు లేక దుర్వాసన
తీరని తాగునీటి సమస్యలు
సాక్షి, మహబూబాబాద్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న మహబూబాబాద్ 2011లో మున్సిపాలిటీగా ఏర్పడింది. ఎనిమిదేళ్ల క్రితం ఈదులుపూసపల్లి, గాంధీపురం, జమాండ్లపల్లి, బేతోలు, ముత్యాలమ్మగూడెం, శనిగపురం పరిసర గ్రామాలను మున్సిపాలిటీలో విలీన ం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ గ్రామాల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.
సమస్యలు ఇలా..
మహబూబాబాద్ పట్టణం నుంచి కురవి వెళ్లే దారిలో బేతోలు గ్రామం ఉంది. ఇక్కడ 1,482 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామంలో డ్రెయినేజీ వ్యవస్థ లేదు. గామం ఎన్‌హెచ్ పక్కన ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పీహెచ్‌సీ సబ్ సెంటర్ నిర్మించారు. కానీ ఇప్పటి వరకు వైద్య సేవలు అందించడంలేదు. అమృత్ పథకం ద్వారా తాగునీటి సమస్య తీరుస్తామని చెప్పిన అధికారులు పైపులు వేశారే తప్ప నీటి సరఫరా చేయడం లేదు. బతుకమ్మ ఘాట్ లేక రోడ్డుమీదనే బతుకమ్మ అడే దుస్థితి నెలకొంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత మానుకోట మున్సిపాలిటీలో రజాలిపేట గ్రామాన్ని కలిపా రు. 1,800 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేసే నాథుడే లేడు. సీసీ రోడ్లు లేక వర్షం వస్తే బురదలో నడవాల్సిన దుస్థితి. పక్కనే ఉన్న సలార్‌తండాకు తాగునీటి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
మహబూబాబాద్ పట్టణం నుంచి తొర్రూరు వెళ్లే దారిలోని శనిగపురం గ్రామంలో ఏడేళ్లుగా సమస్యలు పరిష్కారం కావడం లేదు. గ్రామంలో పలు వీధుల్లో సీసీ రోడ్లు లేవు. డ్రెయినేజీ సమస్య ఉంది. గ్రామంలోని గడ్డమీది బజార్‌కు తాగునీటి కష్టాలు ఉన్నాయి. పన్నులు వసూలు చేస్తున్న అధికారులు సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదని స్థానికులు వాపోతున్నా రు.
మున్సిపాలిటీలో విలీనమైన మరో గ్రామం ముత్యాలమ్మ గూడెం. ఈ గ్రామంలో శ్మశాన వాటిక లేదు. ఎవరైనా మృతిచెందితే రెండు కిలో మీటర్లు తీసుకెళ్లి దహన సంస్కారాలు చేయాలి. బస్సు స్టేజీ నుంచి గ్రామంలోకి వెళ్లే దారి అస్తవ్యస్తంగా ఉంది. పన్నుల వసూళ్ల సమయంలోనే అధికారులకు ఈ గ్రామం గుర్తు కు వస్తుంది తప్ప.. సమస్యలు పరిష్కరించే నాథుడే లేడు.
గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో జమాండ్లపల్లి గ్రామం ఇతర గ్రామాలతో పోటీపడి అభివృద్ధి సాధించింది. మహబూ బాబాద్ మున్సిపాలిటీలో కలిసిన తర్వాత ఈ గ్రామానికి గ్రహణం పట్టుకుంది. అంతర్గత సీసీ రోడ్లు లేవు. సైడ్ కాల్వల నిర్మాణం లేదు. పారిశుద్ధ్య పనులు చేయక దుర్గంధం వెదజల్లుతోంది. శ్మశాన వాటిక అంతంత మాత్రమే. పార్కు, ఇతర జిమ్ వంటి సౌకర్యాలకు నోచుకోలేదు.
మహబూబాబాద్ నుంచి ఇల్లెందు వెళ్లే రహదారి పక్కనే గాంధీపురం గ్రామం ఉంది. ఇక్కడ స్వచ్ఛత కార్యక్రమాలు కనిపించవు. గ్రామంలో కొత్తగుడిసెలు, స్కూల్ బజార్‌లో సీసీ రోడ్లు లేవు. మెయిన్ రోడ్డు నుంచి గ్రామంలోకి వెళ్లే దారిలో వీధి దీపాలు లేవు. దీంతో చీకటి అయితే రోడ్డు మీద దిగిన మహిళలు భయం భయంగా గ్రామంలోకి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.
విలీనం.. అభివృద్ధికి దూరం
విలీనం.. అభివృద్ధికి దూరం
విలీనం.. అభివృద్ధికి దూరం


