డబ్బులిచ్చి.. కాళ్లు మొక్కి | - | Sakshi
Sakshi News home page

డబ్బులిచ్చి.. కాళ్లు మొక్కి

Feb 10 2026 7:55 AM | Updated on Feb 10 2026 7:55 AM

డబ్బులిచ్చి.. కాళ్లు మొక్కి

డబ్బులిచ్చి.. కాళ్లు మొక్కి

ఓటు వేయాలని అభ్యర్థన

బొట్టుపెట్టి డబ్బులు ఇస్తున్న అభ్యర్థులు

ముందస్తుగానే పంపిణీ షురూ..

ముగిసిన ఎన్నికల ప్రచారం

సాక్షి, మహబూబాబాద్‌: గతంలో చేసిన అభివృద్ధి పనుల గురించి చెప్పి ఓట్లు అడిగేవారు. అయితే, ప్రస్తుతం ప్రచార శైలి మారింది. చేసిన పనులు చెప్పడం ఒక మాట అయితే.. ప్రత్యర్థి ఎలా ఓటు అడుగుతున్నాడు.. అందుకు భిన్నంగా ఎలా అడగాలనే ఆలోచనతో కొత్త కొత్త పద్ధతులు అనుసరిస్తున్నారు. డబ్బులు పంచిపెడుతూ కాళ్లు సైతం మొక్కి ఓటు అభ్యర్థిస్తున్నారు.

డబ్బులతో పాటు..

ఓటర్లకు డబ్బులు ఇవ్వడం పరిపాటిగా మారింది. అయితే డబ్బులతో పాటు చిన్నా.. పెద్ద తేడా లేకుండా కాళ్లు మొక్కి ఓటు అడగడం అందరిని విస్మయానికి గురిచేస్తోంది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో సోమవారం ఎన్నికల ప్రచారం ముగిసింది. అయితే బుధవారం ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో చివరి ప్రయత్నంగా ఓటరును ప్రాధేయపడడం మినహా మరో మార్గం కనిపించడం లేదు. కాగా, మహబూబాబాద్‌, కేసముద్రం, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్‌ మున్సిపాలిటీల్లోని పలు వార్డుల్లో ఓటుకు రూ.1,000 నుంచి రూ. 5వేల వరకు అభ్యర్థులు పంచుతున్నారు. డబ్బులు ఇవ్వడంతో పాటు కాళ్లు మొక్కడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. మహబూబాబాద్‌ పట్టణంలోని ఓ వార్డు అభ్యర్థి డబ్బులు ఇవ్వడంతో పాటు కుటుంబ పెద్దల కాళ్ల మీద పడి.. ఓటు వేస్తానని హామీ ఇస్తేనే కాళ్లు విడిచి పెడుతున్న సంఘటనపై చర్చ జరుగుతోంది. పోలింగ్‌కు రెండు రోజుల ముందుగానే డబ్బులు పంపిణీ చేస్తూ ఓటు వేయాలని వేడుకుంటున్నారు.

ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల కోసం..

పట్టణాల్లో ఉన్న ఓటర్లతో పాటు.. చదువు, ఉద్యోగం, వ్యాపారం, ఇతర అవసరాలకోసం ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లపై అభ్యర్థులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే వారి జాబితాను సిద్ధం చేసుకొని ఫోన్‌ చేసి ఓటు వేయడానికి రావాలని కోరుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారికి ట్రైన్‌ టికెట్లు బుక్‌ చేసి పంపారు. హైదరాబాద్‌, ఖమ్మం, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఉన్నవారి కోసం ప్రత్యేక వాహనాలు పంపిస్తున్నట్లు తెలిసింది. ఎంత మంది ఉన్నారు.. వారు ఉండే ప్రదేశానికి దగ్గరలో ఉన్న పాయింట్‌ను చెప్పి అందరూ అక్కడికి రావాలని కోరుతున్నారు. కుటుంబ సభ్యులందరూ ఒకేచోట ఉంటే వారికోసం కారుతో పాటు ప్రత్యేక మనిషిని పంపించి ఓటింగ్‌ రోజు తీసుకువచ్చే పనిలో ఉన్నారు. ‘ఇప్పటికే కార్లు సిద్ధం చేశాం.. మీకు ఎన్ని పనులు ఉన్నా.. ఆ ఒక్కరోజు సెలవు పెట్టుకోండి.. ఓటు వేసిన వెంటనే మళ్లీ మీ ఇంటికి పంపించే బాధ్యత మాదే’ అని ప్రాధేయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement