నిర్భయంగా ఓటు వేయండి
మహబూబాబాద్ రూరల్/మహబూబాబాద్ అర్బన్ : మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోవాలని డీఎస్పీ తిరుపతిరావు అన్నారు. ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం కవాతు (ఫ్లాగ్ మార్చ్) నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, ప్రజలకు పోలీసు శాఖ అండగా ఉంటుందన్నారు. ప్రజల్లో నమ్మకాన్ని కలిగించేందుకు పట్టణంలోని పలు వీధుల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. టౌన్ సీఐ మహేందర్ రెడ్డి మాట్లాడారు. కాగా, పట్టణంలోని శ్రీనివాస సెంటర్, నెహ్రూ సెంటర్, సాయిబాబా టెంపుల్ రోడ్, పత్తిపాక, బాబునాయక్ తండా ప్రా ంతాల్లో సుమారు వంద మంది పోలీసు సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మహబూబా బాద్ టౌన్, రూరల్ సర్కిల్, పోలీస్ హెడ్ క్వార్టర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో..
మానుకోట మున్సిపల్ పరిధిలోని నాలుగో వార్డు గాంధీపురం, 5వ వార్డు అనంతారం, 10వ వార్డు వీరారం తండాలో రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కార్యక్రమంలో సీఐలు సర్వయ్య, మహేందర్‌రెడ్డి, ఆర్‌ఐలు అనిల్, నాగేశ్వర్‌రావు, ఎస్సైలు దీపిక, సతీష్, ప్రశాంత్, షాకీర్, వెంకటేశ్వర్లు, రవికిరణ్, అరుణ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల కవాతు..
డోర్నకల్: మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకుని సోమవారం డోర్నకల్ పోలీసులు పట్టణంలో కవాతు నిర్వహించారు. బైపాస్ రోడ్డు నుంచి ప్రధాన వీధులు మీదుగా కవాతు చేశారు. డోర్నకల్ సీఐ చంద్రమౌళి మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలని కోరారు.


