మధ్యవర్తిత్వంతో ఆస్తి వివాదం పరిష్కారం
మహబూబాబాద్ రూరల్: రెండు కుటుంబాల మధ్య తలెత్తిన ఆస్తి వివాదం మీడియేషన్ సెంటర్‌లో మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాకు చెందిన దాచేపల్లి, అత్తలూరి కుటుంబాల మధ్య ఆస్తి వివాదం తలెత్తింది. దీంతో అత్తలూరి కుటుంబం దాచేపల్లి కుటుంబంపై మహబూబాబాద్ జూనియర్ సివిల్ జడ్జి, సీనియర్ సివిల్ జడ్జి కోర్టుల్లో వేర్వేరుగా 2017లో రెండు సివిల్ కేసులు దాఖలు చేశారు. ఈ రెండు కేసులు పెండింగ్‌లో ఉండగానే 2018లో దాచేపల్లి కుటుంబం జిల్లా కోర్టులో మరో సివిల్ కేసు దాఖ లు చేసింది. అప్పటి నుంచి మూడు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ జనవరి 9న కోర్టు వాయిదా సందర్భంగా ఇరుపక్షాలతో మాట్లాడిన వివాదాన్ని మధ్యవర్తిత్వ కేంద్రానికి పంపించారు. మూడు సివిల్ వివాదాలతో ముడిపడి ఉన్న ఈ కేసులో మీడియేషన్ సెంటర్ కో ఆర్డినేటర్, సీనియర్ సివిల్ జడ్జి శాలిని షాకెల్లి న్యాయవాది వి.హరికృష్ణను మధ్యవర్తిగా నియమించారు. పలు దఫాలుగా న్యాయవాది హరికృష్ణ ఇరుపక్షాలతో మధ్యవర్తిత్వం నిర్వహించడంతో వివాదం రాజీమార్గంలో పరిష్కారమైంది. ఇరుపక్షాల న్యాయవాదులు కె.విజయభాస్కరరావు, పి.కృష్ణయ్య సమక్షంలో వారు మధ్యవర్తిత్వ ఒప్పంద పత్రంపై సంతకాలు చేసి వివాదాన్ని శాశ్వతంగా పరిష్కరించుకున్నారు.


