రెడ్యా పాలనంతా అవినీతిమయమే..
● డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్
డోర్నకల్: దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా పని చేసిన రెడ్యానాయక్ పాలనంతా అవినీతిమయమేనని డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకుని సోమవారం డోర్నకల్ బైపాస్ రోడ్డు నుంచి రైల్వే స్టేషన్ వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీసెంటర్‌లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ నాయకులు ప్రస్టేషన్‌తోనే సీఎం రేవంత్‌రెడ్డిపై అవాకులు, చవాకులు పేలుతున్నారని అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పేరుతో రెడ్యానాయక్ అక్రమాలకు పాల్పడ్డారని, ఇసుక, బెల్లం, రేషన్ బియ్యం అక్రమ రవాణాను ప్రోత్సహించారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎంపీ బలరాంనాయక్ మాట్లాడుతూ.. ఈనెల 15వ తేదీలోగా రైతు భరోసాకు సంబంధించి రూ.9 వేల కోట్లను బ్యాంకుల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్‌యాదవ్, పట్టణ అధ్యక్షులు సుమేర్‌చంద్‌జైన్ తదితరులు పాల్గొన్నారు.


