ఓటర్లు ఎవరి వైపు?
రెండు ప్రాంతాలకు నిఘా వర్గాలు..
జనగామ: మున్సిపల్ ఎన్నికల వేళ జనగామ జిల్లా వ్యా ప్తంగా రాజకీయ వేడి పెరుగుతోంది. ఓటర్లు ఎవరి వైపు ఉంటున్నారు? వారి మనస్తత్వం.. అభ్యర్థుల బలం.. బలహీనత.., పార్టీల గెలుపోటముల అవకాశాలు వంటి కీలక అంశాలపై ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ నిఘా వర్గాలు రోజు వారీగా సమగ్ర సమాచారం సేకరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాజకీయ పార్టీల అంతర్గత లెక్కలు, ప్రచార వ్యూహాల్లోనూ ఈ నివేదికలు కీలకపాత్ర పోషిస్తున్నాయి.
ఎవరి ప్రభావం ఎంత?
జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీల్లో నిఘా అధికారులు ఎన్నికల నిర్వహణ, ఓటర్ల మేనేజ్‌మెంటుతోపాటు సమగ్ర పరిశీలన చేస్తున్నారు. ఏ వర్గం ఓటర్లు ఎవరి వైపు మొగ్గుచూపుతున్నారు? యువత ఏ పార్టీని ఎంచుకుంటుంది.. వృద్ధుల మెజార్టీ ఏ అభ్యర్థిని వరించబోతుంది.. అధికార పార్టీపై ప్రజల మద్దతు ఎంతవరకు ఉంది.. ప్రధాన ప్రతిపక్షాలు ఎక్కడ బలంగా ఉన్నాయి? అనే ప్రతీ అంశంపై విభాగాల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీల నుంచి పోటీలో ఉన్న నాయకుల ప్రభావం ఏ స్థాయిలో ఉందో, వారిని ఎవరు సంప్రదిస్తున్నారో కూడా నిఘా యంత్రాంగం నిశ్చితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
సంపూర్ణ మెజార్టీ.. లేదంటే లాగుడే
జనగామ మున్సిపల్ పరిధిలో చైర్మన్ పీఠంపై పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ 16 సీట్లు, స్టేషన్ ఘన్‌పూర్‌లో 10 సీట్లు గెలుచుకున్న వారికి ఆధిక్యం లభించనుంది. పూర్తి మెజారిటీ ఏ పార్టీకి దక్కుతుందో.. లేక మూడు ముక్కలాట పోటీ పరిస్థితి ఏర్పడుతుందో అన్న విషయంపై ఇంటెలిజెన్స్ విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. మెజార్టీ తక్కువ వస్తే స్వతంత్రుల మద్దతు కీలకమవుతుందన్న అంచనాలపై కూడా ఇప్పటి నుంచే ఆరా తీస్తున్నారు. బీజేపీ మద్దతు ఎవరికి లభిస్తుంది.. ఇతర పార్టీల నుంచి విజయం సాధించే అవకాశమున్న అభ్యర్థులను ఏ పార్టీలు తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయో అనే వివరాలను సూక్ష్మంగా సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏవైనా అంతర్గత ఒప్పందాలు జ రుగుతున్నాయో వంటి వివరాలను సైతం ఇంటలిజెన్స్ నివేదికలో పొందుపరుచుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
నిఘా వర్గాలు జనగామ,స్టేషన్‌ఘన్‌పూర్‌లోనే అడ్డా వేసి రోజువారీ రాజకీయ సమీకరణాల నివేదికలను ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు సమాచారం. ఈ నివేదికల ఆధారంగా పార్టీల్లో ప్రచార వ్యూహాలు మారుతున్నాయి. బలహీన వార్డుల్లో అభ్యర్థి గెలుపునకు చేపట్టబోయే కార్యాచరణ, మార్పులు, అసంతృప్తుల బుజ్జగింపు, మెరుగైన బలమైన వర్గాలను చేరదీసేలా ఈ నివేదికలు కీలకంగా మారుతున్నట్లు తెలిసింది. పురపాలక ఎన్నికలు సాధారణంగా స్థానిక రాజకీయాల్లో కీలకమైనవి. ప్రజాభిప్రాయాలు వేగంగా మారే ఈ సమయంలో నిఘా అధికారుల నివేదికలు రాజకీయ పార్టీలకు ఏకకాలంలో హెచ్చరికగానూ, మార్గదర్శిగా కూడా మారుతున్నాయి. ఇకపై పోలింగ్ వరకు ఈ సమాచార సేకరణ మరింత తీవ్రం కానుందనే విషయం కూడా తెలిసింది.
విజేతలపై స్వతంత్రుల ప్రభావం ఎంత!
జనగామ, స్టేషన్‌లో ఏ పార్టీకి ఎంత మెజార్టీ?
సమగ్ర సమాచారం తెలుసుకుంటున్న నిఘా వర్గాలు
ఇంటెలిజెన్స్ నివేదికలో పార్టీల వ్యూహాలు
ఓటర్లు ఎవరి వైపు?


