76 ఏళ్లలో కూడా పురపోరుకు సై..
● మరిపెడ 11వ వార్డు అభ్యర్థిగా
బాల్యనాయక్ పోటీ
మరిపెడ : సాధారణంగా 70 ఏళ్ల వయసులో ప్రతీ ఒక్కరు కుటుంబంతో శేషజీవితం గడుపుతారు. మనువలు, మనువరాళ్లతో కాలక్షేపం చేస్తుంటారు. మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఏ బాధ, ఇతర ఆలోచనలు లేకుండా ఆనందంగా ఉంటారు. అయితే 76 ఏళ్ల వయసులోనూ ఓ వృద్ధుడు ప్రజాసేవకు సై అంటున్నాడు. యువ అభ్యర్థులతో పోటీ పడుతున్నాడు. అతడే దేశ్యాతండాకు చెందిన బానోత్ బాల్యనాయక్. మరిపెడ మున్సిపాలిటీ 11వ వార్డు నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్నాడు. ఈ సందర్భంగా యువ అభ్యర్థులకు దీటుగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాడు. గతంలో తన భార్య ఎంపీటీసీగా గెలుపొంది ప్రజాసేవ చేసిందని, తాను కూడా 11 వార్డు కౌన్సిలర్‌గా గెలుపొంది ప్రజల మన్ననలు పొందేలా సేవ చేస్తానంటున్నాడు. కాగా, 76 ఏళ్ల బాల్యనాయక్ పట్టుదల, చురుకుదనం చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


