సమష్టి కృషితో జాతర విజయవంతం
హన్మకొండ: అధికారులు, ఉద్యోగుల సమష్టి కృషి తో మేడారం జాతరను విజయవంతంగా ముగించామని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. శనివారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళా క్షేత్రంలో మేడారం జాతర విద్యుత్ విజయోత్సవ, ఉద్యోగుల అభినందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎండీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మేడారం జాతరలో విద్యుత్ శాఖ అత్యుత్తమ పనితీరు కనబరిచిందని సగర్వంగా చెప్పుతున్నానన్నారు. 2024లో జరిగిన జాతరను దృష్టిలో ఉంచుకొని అంతకంటే మెరుగైన సౌకర్యాలతో అన్ని ఏర్పాట్లు చేసి వెలుగుల మేడారం తీర్చిదిద్దామన్నారు. భక్తులందరికీ భరోసా కల్పిస్తూ అంతరాయాలు లేని విద్యుత్ అందించిన ఘనత టీజీ ఎన్పీడీసీఎల్‌కు దక్కుతుందన్నారు. విద్యుత్ అంతరాయాలు నివారించడానికి మొదటిసారిగా ప్రత్యేకంగా 33 కేవీ లైన్‌లో కవర్ కండక్టర్ ఏర్పాటు చేశామన్నారు. రాబోయే మినీ మేడారంలోగా అగ్రిక ల్చర్ సర్వీస్ లోడ్ బదలాయింపు చేస్తామన్నారు. అనంతరం మేడారంలో సేవలందించిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంస పత్రాలు అందించారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి. తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సీఈలు కె.తిరుమల్ రావు, కె.రాజు చౌహాన్, సురేందర్, శ్రవణ్ కుమార్, భూపాలపల్లి ఎస్‌ఈ మల్చూరు నాయక్, డీఈలు నాగేశ్వర రావు, సదానందం, జి.సాంబ రెడ్డి, భాస్కర్, దర్శన్ కుమార్ పాల్గొన్నారు.
ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి


