నిబంధనలు అతిక్రమిస్తే వేటే..!
ఉద్యోగులకూ నియమాలు..
భూపాలపల్లి అర్బన్: మున్సిపల్ ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎన్నికల ప్రకటన వెలువడిన రోజు నుంచి ప్రక్రియ ముగిసే వరకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రభుత్వం, ఎన్నికల విధుల్లో ఉండే అధికార యంత్రాంగం, సిబ్బంది అందరూ ప్రవర్తనా నియమావళి అనుసరించాల్సిందే. ఎవరైనా ఉల్లంఘిస్తే ప్రజలు సైతం ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
నియమావళి ఇలా..
● రాజకీయ పార్టీ, పోటీ చేసే అభ్యర్థి ఉద్రిక్త పరిస్థితులను పెంచేందుకు ప్రయత్నించడం, విద్వేషాలను రెచ్చగొట్టడం, కుల, మత, వర్గ, ప్రాంతీయ విభేదాలు సృష్టించే కార్యక్రమాల్లో పాలుపంచుకోవద్దు.
● జాతి, మతం, కులం పేరుతో ఓట్లు అడగొద్దు.
● ఎన్నికల ప్రచారానికి దేవాలయాలు, మసీదులు, చర్చీలను వేదికలు చేసుకోవద్దు.
● పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రజా జీవితానికి సంబంధించిన అంశాలు కాకుండా వ్యక్తిగత ఆరోపణలు చేయొద్దు.
● విపక్ష పార్టీల అభ్యర్థుల నివాసాల వద్ద వారి అభిప్రాయాలు కార్యకలాపాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయొద్దు.
● ఇంటి యజమానుల అనుమతి లేకుండా జెండాలు కట్టడం, గోడలపై పోస్టర్లు అతికించడం, ప్రచార రాతలు రాయడం చేయొద్దు.
● ప్రింటింగ్ ప్రెస్, పేరు, చిరునామా లేకుండా పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్లు ముద్రించొద్దు.
● ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ర్యాలీల నిర్వహణకు సంబంధిత అధికారి వద్ద అనుమతి తీసుకోవాలి.
● ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య మాత్రమే లౌడ్ స్పీకర్లను వాడాలి.
ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాలి. ఏ పార్టీకి, వ్యక్తులకు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా పనిచేయొద్దు.
ఎన్నికల ప్రచారంలో పాల్గొనొద్దు.
ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రైవే ట్ కార్యక్రమాల్లో, విందుల్లో పాల్గొనొద్దు.
ప్రభుత్వ ధనాన్ని సభలు, సమావేశాలకు వినియోగించొద్దు. ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలు, వాహనాలను వినియోగించొద్దు.
పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల కోడ్
పాటించాలి


