యూరియా కోసం రైతుల లొల్లి
కురవి: మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఎరువుల దుకాణం వద్ద మంగళవారం యూరియా కోసం వచ్చిన రైతులు క్యూలో నిల్చొని పడిగాపులుపడ్డారు. కూపన్లు చేత పట్టుకుని రైతులు, మహిళా రైతులు క్యూలో బారులుదీరారు. యూరియా పంపిణీ సమయంలో రైతుల మధ్య తోపులాట జరిగింది. యూరియా పంపిణీ వద్ద ఎలాంటి బందోబస్తు లేకపోవడంతో రైతులు ఒకరినొకరు నెట్టుకోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైతుల మధ్య లొల్లి జరగడంతో షాపు యజమాని యూరియా పంపిణీ చేయకుండా షాపు తలుపులు మూసివేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏఓ నరసింహరావు ఎరువుల దుకాణం వద్దకు వచ్చి పరిశీలించారు. రైతుల మధ్య గొడవ జరగడంతో ఏఓ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, యూరియా పంపిణీ సక్రమంగా చేయాలని రైతులు కోరుతున్నారు.
యూరియా కోసం క్యూ..
డోర్నకల్: మండలంలోని గొల్లచర్ల గ్రామ సమీపంలోని డోర్నకల్ పీఏసీఎస్ కార్యాలయం వద్ద మంగళవారం యూరియా కోసం రైతులు క్యూ కట్టారు. గొల్లచర్ల, చిలుకోడు, వెన్నారం క్లస్టర్ల పరిధి రైతులు భారీ సంఖ్యలో పీఏసీఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. తహసీల్దార్ రాఘవరెడ్డి, సీఐ చంద్రమౌళి సమక్షంలో రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేశారు. యూరియా నమోదు కోసం ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ యాప్ పని చేయకపోవడంతో ఆఫ్‌లైన్ పద్ధతిన ఎరువులను పంపిణీ చేశారు. మరోవైపు డోర్నకల్‌లోనూ రెండు దుకాణాల్లో యూరియా పంపిణీ చేయగా.. బస్తాతో పాటు రూ.500 విలువైన ఇతర ఉత్పత్తులను అంటగట్టడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


