ప్రాజెక్టు సర్వేకు వచ్చిన అధికారుల అడ్డగింత
గార్ల: మండలంలోని మున్నేరు ఏటి నీటిని పాలేరుకు తరలింపులో భాగంగా మంగళవారం కాల్వల నిర్మాణ సర్వే కోసం వచ్చిన రెవెన్యూ అధికారులను దుబ్బగూడెం గ్రామంలో రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి మున్నేరు నీటిని కాల్వల ద్వారా తన నియోజకవర్గం పాలేరుకు తరలిస్తే సహించేది లేదన్నారు. ఇప్పటికే పాలేరుకు నాగార్జునసాగర్, సీతా రామ ప్రాజెక్టు నుంచి కాల్వల ద్వారా సాగునీరు వస్తుందని, ఇంకా మున్నేరు నీటిని తరలించేందుకు ప్రయత్నించడం తగదన్నారు. దుబ్బగూడెం ప్రాంతంలో మున్నేరు ఏటిపై ప్రాజెక్టు కట్టి కాల్వల నిర్మాణం కోసం భూముల సర్వేకు వచ్చిన సర్వేయర్లు, రెవెన్యూ అధికారులను అడ్డుకొని ఇక్కడి నుంచి పంపించామని చెప్పారు. కాల్వల కోసం తమ భూములు ఇచ్చేది లేదని, అవసరమైతే తమ ప్రాణాలను అడ్డుపెట్టి ప్రభుత్వంపై పోరాటాలు చే స్తామని రైతులు హెచ్చరించారు. మా నీళ్లు మాకు ఉపయోగపడకుండా, మా భూములను కోల్పోయి, పాలేరుకు నీళ్లు ఎందుకు ఇవ్వాలంటూ రైతులు అధి కారులను ప్రశ్నించారు. సర్వేను అడ్డుకున్న వారిలో సీపీఎం జిల్లా నాయకుడు శ్రీనివాసరావు, రైతులు జాస్తి సత్యనారాయణ, జాస్తి సాగర్‌బాబు, జాస్తి రాజా, నాగేందర్‌బాబు, ఉదయ్‌కుమార్, సుజాత, వేజెళ్ల సుధాకర్, వై.పట్టాబి, బి. తేజ్యా, ఎన్.బాలు, బి.చందర్, కిషన్, వి.శ్రీను, బి.సరిలాల్ ఉన్నారు.
కాల్వల కోసం తమ భూములు ఇచ్చేది లేదని తేల్చిచెప్పిన రైతులు


