విద్యార్థులు.. గజగజ
మహబూబాబాద్ అర్బన్: రోజురోజుకూ చలి తీవత్ర పెరుగుతుండడంతో కనిష్ట ఉష్టోగ్రతలు నమోదు అవుతున్నాయి. సాయంత్రం 4గంటల నుంచే చల్ల టి గాలులు వీస్తున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతోంది. అదేవిధంగా తెల్లవారుజాము నుంచే మంచు కురుస్తోంది. కాగా ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులు చలికి గజగజ వణుకుతున్నారు. గదులకు తలుపులు సరిగ్గా లేక, కిటికీలకు రెక్కలు లేక చలి నేరుగా గదిలోకి వస్తుండడంతో అవస్థలు పడుతున్నారు. సరైన దుప్పట్లు లేక చలికి వణికిపోతున్నారు. ఉన్న కొద్దిపాటి దుప్పట్లతోనే సర్దుకుపోతున్నారు.
చన్నీటి స్నానాలు..
జిల్లాలోని వసతి గృహాల్లో విద్యార్థులు నిద్రలు లేని రాత్రులు గడుపుతున్నారు. దీనికి తోడు దోమలు స్వైర విహారంతో వారికి కంటిమీద కునుకు లేకుండాపోతోంది. చలికి తోడు చన్నీళ్ల స్నానాలతో జలు బు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాలు, కేజీబీవీలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థులు వేడి నీళ్లు లేకపోవడంతో చన్నీటి స్నానం చేయాలంటే జంకుతున్నారు.
జిల్లాలో వసతి గృహాల వివరాలు..
జిల్లాలో 19 ఎస్సీ హాస్టళ్లలో 1,878మంది విద్యార్థులు ఉన్నారు. 34 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, ఎస్టీ హాస్టళ్లలో 8,861మంది, 14 బీసీ హాస్టళ్లలో 1,300మంది, 6 మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 2,970మంది, 6 సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 3,440మంది, 16ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 6,059 మంది, 5 మైనార్టీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 1,129మంది, 16 కస్తూర్బాగాంధీ విద్యాలయాల వసతి గృహాల్లో 3,391మంది, 8 మోడల్ స్కూల్ కళాశాలల వసతి గృహాల్లో 760మంది విద్యార్థులు ఉన్నారు. ఎస్సీ, బీసీ, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం కిటికీలు, తలుపుల మరమ్మతులకు రూ.లక్షలు నిధులు మంజూరయ్యాయి. కానీ నేటికీ మరమ్మతులు మాత్రం చేయించలేదు. విద్యార్థులు తమ బాధలను చెప్పుకుందామన్నా.. పలువురు హాస్టల్ వార్డెన్లు స్థానికంగా అందుబాటులో ఉండడం లేదని తెలిసింది.
స్థానికంగా ఉండని వార్డెన్లు..
ప్రభుత్వ నింబంధనల ప్రకారం సంక్షేమ హాస్టళ్ల వార్డెన్లు వసతి గృహాల్లోనే రాత్రి బస చేయాలి. కానీ పలు హాస్టళ్ల వార్డెన్లు రాత్రి వేళల్లో బస చేయకుండా వరంగల్, హనుమకొండ వంటి పట్టణాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. అదేవిధంగా మానుకోట జిల్లా కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో రాత్రి వేళ దొంగలు దూరి విద్యార్థుల ఫోన్లు, దుప్పట్లు, దుస్తులు, డబ్బులు ఎత్తుకెళ్తున్నారు. ఈ విషయంపై విద్యార్థులు వార్డెన్లకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడంలేదని విమర్శలు వస్తున్నాయి. అలాగే పలు హాస్టళ్ల విద్యార్థులు రాత్రి వేళ మద్యం, సిగరెట్లు తాగుతున్నారు. బయటి నుంచి ఎవరు ఎప్పుడు వస్తున్నారో అర్థం కావడం లేదని, దీంతో చాలా మంది విద్యార్థులు చెడు వ్యసనాలకు, మత్తుకు బానిసలవుతున్నారని తోటి విద్యార్థులు చెబుతున్నారు.
గిరిజన హాస్టల్‌లో నేలపై నిద్రిస్తున్న విద్యార్థులు
రోజురోజుకూ పెరుగుతున్న చలి తీవ్రత
కిటికీలు, తలుపులకు రెక్కలు కరువు
స్థానికంగా ఉండని వార్డెన్లు
విద్యార్థులు.. గజగజ
విద్యార్థులు.. గజగజ


