బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చర్యలు
మహబూబాబాద్ రూరల్: బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడం, పిల్లల రక్షణ, పునరావాసం, వారి హక్కుల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తామని ఎస్పీ డాక్టర్ శబరీష్ అన్నారు. బాలల భవిష్యత్‌ను కాపాడే దిశగా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమ పోస్టర్లను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మంగళవారం ఆవిష్కరించారు. జనవరి 1నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో పోలీసు శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, విద్యాశాఖ, ఆరోగ్య శాఖ, చైల్డ్ లైన్ 1098 , జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, షీ టీమ్స్, భరోసా కేంద్రం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తదితర విభాగాలు సమన్వయంతో పని చేస్తాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతీ బాలుడు గౌరవంగా జీవించే హక్కు కలిగి ఉన్నాడని, బాలల చిరునవ్వును కాపాడడమే ఆపరేషన్ స్మైల్ ప్రధాన లక్ష్యమన్నారు. బాల కార్మిక వ్యవస్థపై రాజీ పడేది లేదని, బాలకార్మికులను గుర్తించి రక్షించడం, బాధిత పిల్లలకు పునరావాసం కల్పించి పాఠశాలల్లో చేర్చడం, బాలల అక్రమ రవాణా, దోపిడీ, దౌర్జన్యాలను అరికట్టడం, ప్రజల్లో అవగాహన పెంపొందించడం ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రజలు ఎవరైనా బాలకార్మికులు లేదా పిల్లలపై జరుగుతున్న అక్రమాలను గమనిస్తే వెంటనే చైల్డ్ లైన్ 1098 లేదా డయల్ 112 కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మోహన్, డీసీఆర్బీ సీఐ ఉపేందర్ రావు, సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ డాక్టర్ నాగవాణి, సభ్యులు అశోక్, డేవిడ్, చైల్డ్ లైన్, భరోసా, షీటీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


