ప్రజలు సహకరించాలి
మహబూబాబాద్ రూరల్: జిల్లాలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా శాంతి భద్రతలు పరిరక్షించేందుకు ప్రజలు సహకరించాలని ఎస్పీ డాక్టర్ శబరీష్ అన్నా రు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఎస్పీ మాట్లాడుతూ.. బుధవారం (డిసెంబర్ 31), జనవరి ఒకటో తేదీన ఎలాంటి డీజే కార్యక్రమాలకు అనుమతిలేదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే శిక్షార్హులవుతారని, జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రోడ్లపై కేకలు వేయడం, అతివేగంగా వాహనాలు నడపడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్లపై క్రాకర్స్ కాల్చడం, కేకులు కట్ చేయడం నిషేధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించడాన్ని సహించబోమని, ముఖ్యంగా మహిళల పట్ల గౌరవంగా వ్యవహరించాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
కమిషన్ ఏర్పాటు చేయాలి
తొర్రూరు: ఓసీల సమస్యల పరిష్కారానికి జాతీయస్థాయిలో కమిషన్ ఏర్పాటు చేయాలని ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జయపాల్‌రెడ్డి అన్నారు. డివిజన్ కేంద్రంలోని లయన్స్ క్లబ్ భవనంలో మంగళవారం ఓసీ జేఏసీ సమావేశం నిర్వహించారు. జనవరి 11న హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీలో జరిగే ఓసీ ల సింహగర్జన బహిరంగ సభ పోస్టర్లను సంఘ నాయకులు ఆవిష్కరించారు. జేఏసీ నాయకుడు ముద్దం విక్రమ్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడారు. ఐదేళ్ల కాల పరిమితితో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీ చేయాలని, ఓసీ విద్యార్థులకు టెట్ అర్హత మార్కులు 90 నుంచి 70 మార్కులకు తగ్గించాలన్నారు. సమావేశంలో ఓసీ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుబ్బ శ్రీనివాసరావు, నాయకులు నడిపల్లి వెంకటేశ్వరరావు, ప్రతాప్‌రెడ్డి, డాక్టర్ రాజేందర్‌రెడ్డి, అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి, పొద్దుటూరి గౌరీశంకర్, తమ్మెర లక్ష్మీనరసింహరావు పాల్గొన్నారు.
రామప్ప దేవాలయాన్ని సందర్శించిన అడిషనల్ సీపీ
వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయాన్ని మంగళవారం హైదరాబాద్ అడిషనల్ సీపీ (క్రైం) శ్రీనివాస్ కుటుంబసమేతంగా సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప శిల్పకళాసంపద బాగుందని వారు కొనియాడారు.
ప్రజలు సహకరించాలి


