రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలు షురూ..
● రాత్రి 10 గంటల వరకు కొనసాగిన లీగ్ మ్యాచ్‌లు
● 25 జిల్లాల నుంచి 620 మంది క్రీడాకారుల రాక
జనగామ: జిల్లా కేంద్రం బతుకమ్మకుంటలో 8వ సబ్ జూనియర్స్ స్టేట్ లెవల్ నెట్‌బాల్ చాంపియన్ షిప్–2025 పోటీలను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. జిల్లా నెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు రామస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ రొడ్రిక్స్ రాజ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి రవికుమార్ ఆధ్వర్యాన అండర్–16 పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకు 25 జిల్లాల నుంచి 620 మంది బాలురు, బాలికల క్రీడాకారులు వచ్చారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12, సాయంత్రం 4.30 నుంచి రాత్రి 10.30 గంటల వరకు రెండు షిఫ్టుల వారీగా ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పోటీలు నిర్వహిస్తున్నారు.
తొలిరోజు 45 మ్యాచ్‌లు
ఉదయం, సాయంత్రం రెండు షిఫ్టుల్లో సుమారు 45 మ్యాచ్‌లు ఆడారు. పాయింట్ల పట్టికలో ముందు వరుసలో ఉన్న టీంలు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంటాయి. అక్కడ ప్రతిభ కనబరిచిన జిల్లాలు సెమీఫైనల్, ఫైనల్‌లో తలపడనున్నాయి. నేడు(శనివారం) రాత్రి 10 గంటల వరకు సెమీఫైనల్ పోటీలను ముగించాలి.. సాధ్యం కాని పరిస్థితుల్లో 18న మిగిలిన మ్యాచ్‌లు పూర్తి చేసి సాయంత్రం ఫైనల్ పోటీలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యంగా ఉండేందుకు దోహద పడుతాయన్నారు. డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుకుంటూనే.. ఆసక్తి ఉన్న ఆటల్లో తర్ఫీదు తీసుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు.


