● న్యాయస్థానంలో నిలవదని తెలిసినా
బీసీలను నమ్మించే ఎత్తుగడ
● గతంలో బీసీలకు 34 శాతం
రిజర్వేషన్ ప్రకటించిన వైఎస్ జగన్
● ఇదే అంశంపై కోర్టుకు వెళ్లిన టీడీపీ నేతలు
● ఇచ్చిన మాట మేరకు ఓసీ స్థానాల్లో కూడా
బీసీలకు అవకాశం కల్పించిన జగన్
● ఐదేళ్ల పాలనలో బీసీలకు
అనేక సంక్షేమ పథకాల అమలు
కర్నూలు(అర్బన్): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బీసీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు మించకూడదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తెలిసినా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీఓలు జారీ చేయడం మోసం చేయడమేనని మండిపడుతున్నారు. గతంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని భావించగా టీడీపీ వారే కోర్టును ఆశ్రయించిన సంగతిని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అప్పట్లో ఏర్పడిన న్యాయపరమైన చిక్కులతో 34 శాతం రిజర్వేషన్‌ను బీసీలకు ఇవ్వలేకపోయిన జగన్ ప్రభుత్వం ఓసీ స్థానాల్లో కూడా బీసీలకు అవకాశం కల్పించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతం పరిమితి దాటితే కోర్టు కొట్టివేస్తుందని తెలిసినా, చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం రాజకీయ లబ్ధి కోసం ముఖ్యంగా బీసీల ఓట్ల కోసమే జీఓలు జారీ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాము బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇచ్చాం, కానీ కోర్టులు అంగీకరించడం లేదని బీసీలను నమ్మించి వారి ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు వేసిన ఎత్తుగడే తప్ప మరొకటి కాదని పలువురు బీసీ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీఓలతో కాకుండా సమగ్ర బీసీ జనగణన లేకుండా, ప్రత్యేక చట్టం తీసుకురాకుండా, 34 శాతం రిజర్వేషన్లు అంటూ జీఓలు జారీ చేడయం సరికాదంటున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నెరవేరుస్తామనే భావనను బీసీల మదిలో రుద్దేందుకు తీసుకున్న చర్యే తప్ప బీసీలను రాజకీయంగా అందలం ఎక్కించేందుకు కాదని వారంటున్నారు.
వైఎస్ జగన్ హయాంలో
బీసీలకు సంక్షేమ పథకాల జాతర
చట్టపరంగా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయలేక పోయినా, అనేక ఓసీ స్థానాల్లో బీసీలకు అవకాశం కల్పించి వారికి రాజకీయ హోదా కల్పించిన వైఎస్ జగన్ మరో అడుగు ముందుకు వేసి వారి ఆర్థికాభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు.
● వైఎస్సార్ చేదోడు కింద నాయీ బ్రాహ్మణులకు, అలాగే రజక, టైలరింగ్ కింద ఒక్కొక్కరి రూ.10 వేల ప్రకారం ఉమ్మడి జిల్లాలోని 1,02,452 మందికి రూ.102.45 కోట్లు డీబీటీ ద్వారా వారి ఖాతాల్లో జమ చేశారు.
● వైఎస్సార్ నేతన్న నేస్తం కింద ఒక్కో చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేల ప్రకారం 4,200 కుటుంబాలకు రూ.40.32 కోట్లు అందించారు.
● వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, కళ్యాణమస్తు, షాదీ తోఫా, జగనన్న తోడు, వైఎస్సార్ బీమా, వైఎస్సార్ సున్నా వడ్డీ రుణాలు తదితర పథకాల ద్వారా ఉమ్మడి జిల్లాలో లక్షల సంఖ్యలో బీసీ వర్గాలకు చెందిన ప్రజలు లబ్ధి పొందారు.
● ముఖ్యంగా బీసీల్లోని 139 కులాలకు సంబంధించి 56 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీ నేతలనే ఆయా కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను నియమించారు.
● ప్రభుత్వ, నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టుల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారు.
● మంత్రి వర్గంలో కూడా 50 శాతం కంటే ఎక్కువ మంది బీసీలకు మంత్రులుగా నియమించారు. కర్నూలు జిల్లాలో ఐదేళ్లు ఆలూరు నుంచి ప్రాతినిథ్యం వహించిన గుమ్మనూరు జయరాం మంత్రిగా పని చేశారు.
● గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆదోని ఎమ్మెల్సీగా ఎన్నికైన డాక్టర్ మధుసూదన్ ఇప్పటికీ పనిచేస్తున్నారు.
వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో బీసీల ప్రాతినిధ్యం
మొత్తం స్థానాలు బీసీలకు రిజర్వ్ వైఎస్సార్‌సీపీ
కేటాయించిన స్థానాలు
జెడ్పీటీసీ 53 15 20
ఎంపీటీసీ 809 --- 290
సర్పంచులు 972 256 320
ఎంపీపీ 53 15 20
వార్డు మెంబర్స్ 10,006 2,783 3,500


