కర్నూలు(సెంట్రల్): విజయవాడలో నాలుగు రోజులపాటు నిర్వహించిన క్యాంపు కోర్టులు విజయవంతంగా ముగిసినట్లు ఆ సంస్థ చైర్మన్ జస్టిస్ టి.మల్లికార్జునరావు తెలిపారు. విజయవాడలోని సబ్ కార్యాలయంలో సెప్టెంబర్ 28, 29, 30, అక్టోబర్ 1వ తేదీల్లో క్యాంపు కోర్టులు నిర్వహించగా ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ పెద్ద సంఖ్యలో కొత్త అర్జీలు వచ్చాయన్నారు. వివిధ జిల్లాలకు చెందిన ఫిర్యాదుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, సంబంధిత పక్షాలు విజయవాడలోనే విచారణకు హాజరయ్యేందుకు క్యాంపు కోర్టు ద్వారా అవకాశం కల్పించామన్నారు. తద్వారా లోకాయుక్త సంస్థ సేవలు ప్రజలకు మరింత చేరువ చేయగలిగామన్నారు. కాగా, క్యాంపు కోర్టు నిర్వహణకు సహకరించిన విజయవాడ కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


