మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీరాఘవేంద్రస్వామి కొలువైన శ్రీమఠానికి హుండీ ఆదాయం రూ.3.04 కోట్లు సమకూరింది. గురువారం శ్రీమఠం రాజ్యాంగణ భవనంలో 22 రోజుల(సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ) హుండీ లెక్కింపు చేపట్టారు. ఇందులో నగదు రూపంలో రూ.2,96,07,906.. నాణేలా రూపంలో రూ.8,30,000 వచ్చినట్లు మేనేజర్ ఎస్.కె శ్రీనివాసరావు తెలిపారు. అలాగే 48 గ్రాముల బంగారం, 285 గ్రాముల వెండి కానుకలు సమకూరాయన్నారు. కార్యక్రమంలో ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్–2 వెంటేష్ జోషి, ఇంజనీర్ సురేష్‌కోనాపూర్, అనంతపురాణిక్ పాల్గొన్నారు.
జెడ్పీకి ప్రథమ బహుమతి
కర్నూలు(అర్బన్): జిల్లా స్థాయిలో నిర్వహించిన ‘స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాలు’ విభాగంలో జిల్లా పరిషత్ కార్యాలయం ప్రథమ బహుమతి కై వసం చేసుకుందని జెడ్పీ సీఈఓ ఆర్.సుధాకర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు, ఉద్యోగుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా చేపట్టిన సర్వేలో జిల్లా పరిషత్ కార్యాలయానికి వంద మార్కులు వచ్చాయన్నారు. జెడ్పీ ప్రథమ బహుమతి సాధించడంలో అధికారులు, ఉద్యోగుల కృషి ఎంతో ఉందని, ఇందుకు కారణమైన వారందరికీ ఆయన అభినందనలు తెలిపారు.
హాస్టళ్లలో రికార్డులు పక్కాగా నిర్వహించాలి
కర్నూలు(అర్బన్): జిల్లాలోని ప్రభుత్వ బీసీ వసతి గృహాల్లో రికార్డులను సక్రమంగా నిర్వహించాలని జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారిణి కె.ప్రసూన ఆదేశించారు. గురువారం స్థానిక బీసీ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఆమె విద్యార్థులకు దుప్పట్లు, కార్పెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వసతిగృహాల్లో మెనూ తప్పక పాటించాలన్నారు. అన్ని వసతి గృహాల్లో 10వ తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణులయ్యేలా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బీసీ వసతి గృహ సంక్షేమాధికారుల సంఘం అధ్యక్షులు పాలెగార్ సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికలకు బ్యాలెట్ పేపర్ సిద్ధం
కర్నూలు(అర్బన్): జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పేపర్ సిద్ధం ఉందని జిల్లా పరిషత్ సీఈఓ ఆర్.సుధాకర్‌రెడ్డి తెలిపారు. బ్యాలెట్ పేపర్‌తో పాటు ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి(కవర్లు, ఇంక్ తదితరాలు) కమిషనర్ ఆఫ్ పంచాయతీరాజ్ నుంచి వచ్చిందన్నారు. డీపీఆర్‌సీ భవనంలో భద్రపర్చిన సామాగ్రిని గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ కర్నూలు జిల్లాకు 19.9, నంద్యాల జిల్లాకు 19 మెట్రిక్ టన్నుల బ్యాలెట్ పేపర్ వచ్చిందన్నారు. కర్నూలు జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు పెద్దవి 1,595, మీడియం 14, చిన్నవి 220.. నంద్యాల జిల్లాకు పెద్ద బ్యాలెట్ బాక్సులు 154, మీడియం 112, చిన్నవి 139 ఉన్నాయన్నారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు. కార్యక్రమంలో కార్యాలయ పర్యవేక్షకులు మురళీమోహన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


