పెద్దకడబూరు: తన భర్తకు ప్రాణం పోసి పునర్జన్మను అందించారని, ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి కుటుంబం అందించిన సాయాన్ని జీవితంలో మరచిపోలేమని పెద్దకడబూరు ఎస్సీ కాలనీకి చెందిన మారెమ్మ అన్నారు. రాంపురం గ్రామంలోని ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ఆయనను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరునెలల క్రితం తన భర్త విజయ్ వాస్కులర్ వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురై కొన ఊపిరితో చావు బతుకుల మధ్య ఉన్నాడన్నారు. స్థానిక నాయకుల ద్వారా ఎమ్మెల్యే దృష్టికి పరిస్థితి తీసుకెళ్లగా ఆర్థిక సాయం చేశారన్నారు. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో మంచి వైద్యం అంది తన భర్త ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తన భర్త ప్రాణాలు నిలపడానికి వైఎస్సార్‌సీపీ నాయకులు కూడా విరాళాలు సేకరించి అండగా నిలిచారన్నారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మాట్లాడుతూ.. మానవత్వంతో ప్రతి ఒక్కరూ ముందుకు వస్తే ఇలాంటి సమస్యలను అధిగమించవచ్చునన్నారు. ఇలాంటి వాటికి తమ కుటుంబం ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ముక్కరన్న, అర్లప్ప, రాజు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.


