బేతంచెర్ల: మండల పరిధిలోని గూటుపల్లెకు చెందిన యువకుడు చెరువులో పడి మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఏఎస్‌ఐ విక్టర్‌బాబు తెలిపిన వివరాల మేరకు.. గూటుపల్లెకు చెందిన బిజ్జన్న గారి రంగయ్య, లక్ష్మీదేవి దంపతుల పెద్ద కుమారుడు రమేష్ (24) ఆయా ప్రాంతాల్లో టైల్స్ ఫ్లోరింగ్ పని చేస్తుంటాడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పలు చోట్ల వైద్యం చేయించినా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ స్థితిలో బుధవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు అతని కోసం గాలించారు. గ్రామంలోని చెరువు వద్ద రమేష్ చెప్పులు కనిపించడంతో అనుమానం వచ్చి చెరువులో గాలించినా ఆచూకీ లభించలేదు. ఈ స్థితిలో శుక్రవారం ఉదయం రమేష్ మృతదేహం చెరువులో తేలడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బేతంచెర్ల ఆస్పత్రికి తరలించారు. తల్లి లక్ష్మిదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ వెల్లడించారు.
పెయింట్ వేస్తూ కింద పడిన యువకుడు
● తీవ్రంగా గాయపడటంతో
ఆస్పత్రికి తరలింపు
సి.బెళగల్: నూతన భవనానికి పెయింట్ వేస్తూ సార్వ విరిగి కిందపడి యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాలు.. సి.బెళగల్‌లోని కోట వీధిలో నివాసముంటున్న సత్తార్‌కు నలుగురు కుమార్తెలు, కుమారుడు ఖాజాహుసేన్ ఉన్నారు. ఖాజాహుసేన్ (24) మిత్రులతో కలిసి పెయింట్ వేసే పనులకు వెళ్తూ కుటుంబానికి ఆసరాగా ఉన్నాడు. గ్రామంలో నూతనంగా నిర్మించిన భవనానికికి రంగులు వేసే పనికి గురువారం వెళ్లాడు. పొడవాటి కర్రలతో ఏర్పాటు చేసిన సార్వపై ఖాజాహుసేన్ ఎక్కి రంగులు వేస్తుండగా కర్రలు విరిగాయి. ఖాజాహుసేన్ భవనం పక్కనున్న సీసీ రోడ్డుపై పడటంతో తలకు తీవ్ర రక్తగాయం అయ్యింది. బాధితుడికి ప్రథమ చికిత్స అనంతరం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఖాజాహుసేన్‌ను వెంటిలేటర్ ఉంచి చికిత్స అందిస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
హైవేలో దోపిడీ
పాణ్యం: మండల పరిధిలోని జాతీయ రహదారిపై తెల్లవారుజామున శాంతిరామ్ మెడికల్ కళాశాల వద్ద ఆగి ఉన్న కారులో దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్‌లో మెడిసిన్ చదువుతున్న నలుగురు విద్యార్థులు టీఎస్ 07 కేజీ 2554 నంబర్ గల కారులో అరుణాచలం బయలుదేరారు. శుక్రవారం తెల్లవారుజామున నిద్ర రావడంతో శాంతిరాం మెడికల్ కళాశాల వద్ద కారు సైడ్‌కు ఆపి నిద్రించారు. ఆ సమయంలో బైక్‌పై వచ్చిన దొంగలు కారు వెనక భాగంలో అద్దాలు పగులగొట్టి బ్యాగ్‌లను ఎత్తుకెళ్లారు. బ్యాగ్‌లో దుస్తులు, ఇతర వస్తువులు ఉన్నట్లు బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న హైవే పోలీసులు, పాణ్యం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు విచారణ జరుపుతున్నారు.
యువకుడి హత్యకేసులో తండ్రి, అన్న అరెస్ట్
బేతంచెర్ల: మండల పరిధిలోని ఆర్‌ఎస్ రంగాపురంలో యువకుడి హత్యకేసులో అతని తండ్రి, అన్నను అరెస్టు చేసినట్లు సీఐ వెంకటేశ్వరరావు శుక్రవారం తెలిపారు. వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గంప ఎల్ల రమేష్ (23) మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను వేధించేవాడు. అతడి వేధింపులు తాళలేక ఈనెల 17న రమేష్ మెడకు తాడు బిగించి తండ్రి గంప లింగన్న, అన్న శివనారాయణ హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులైన లింగప్ప, శివనారాయణలను గ్రామం సమీపంలోని కాశిరెడ్డి నాయన ఆశ్రమం వద్ద అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు నేరాన్ని అంగీకరించడంతో అరెస్టు చేసి, నిందితులు ఉపయోగించిన తాడును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను డోన్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపినట్లు సీఐ వెల్లడించారు.


