మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థుల చాతుర్మాస దీక్ష శనివారంతో ముగియనుంది. గత నెల 10 నుంచి 48 రోజుల పాటు స్వామిజీ దీక్ష బూనారు. చాతుర్మాస నియమ నిష్టలతో సద్గురు రాఘవేంద్రులు, ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయల సేవలో తరించారు. ధార్మిక పర్యటనలకు దూరంగా ఉంటూ స్వామి సన్నిధిలో దీక్ష చేపట్టారు. దీక్ష పూర్తి కానున్న సందర్భంగా స్వామీజీ సీమోల్లంఘన కార్యక్రమం జరగనుంది. రాత్రి స్వామిజీ మాధవరం రోడ్డులోని కొండాపురం ఆంజనేయస్వామి చెంతకు వెళ్లి విశేష పూజలు నిర్వహించారు. అక్కడ వేలాది మంది భక్తులకు ఆశీర్వచనాలు అందిస్తూ మంత్రాలయం రాఘవేంద్రస్వామి సర్కిల్ చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక అలంకరణ వాహనంపై ఆశీనులై ఊరేగింపుగా బయలు దేరుతారు. పండితుల వేద పఠనాలు, గురుసార్వ భౌమ సాహిత్య అకాడమీ మహిళల భజనలు, బాణసంచాతో ఎంతో ఘనంగా ఊరేగనున్నారు. ప్రధాన ముఖద్వారం నుంచి మధ్వ కారిడార్ ద్వారా శ్రీమఠం చేరుకుంటారు. యోగీంద్ర మంటపంలో స్వామిజీని శ్రీమఠం పరిపాలన అధికారులు, స్థానిక ప్రముఖులు సన్మానిస్తారు. అనంతరం స్వామిజీ చాతుర్మాస దీక్ష పవిత్రతను భక్తులకు ప్రవచిస్తారు.


