ఆదోని: ప్రభుత్వ ఆస్పత్రి అంటే పేద, మధ్య తరగతి ప్రజలకు భరోసా. అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడే వైద్య సిబ్బంది అక్కడ 24 గంటలు అందుబాటులో ఉంటారన్న నమ్మకం. కానీ అందుబాటులో ఒక్కరూ కూడా లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో పెద్ద హరివాణం 30 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చోటు చేసుకున్న ఘటన ప్రశ్నిస్తోంది. ప్రసవ వేదనతో ఆసుపత్రికి వచ్చిన గర్భిణికి వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఆమె బంధువులే లేబర్ రూంకు తీసుకెళ్లి ప్రసవం చేయాల్సి వచ్చింది. ఈ ఘటన కలకలం రేపుతోంది. గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ప్రభుత్వం ఈ ఘటనపై ఏం సమాధానం చెబుతుందని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
ఉదయం 8 గంటలకు ఆసుపత్రికి..
కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామానికి చెందిన పవిత్ర రెండో కాన్పు కోసం పురిటి నొప్పులతో బుధవారం ఉదయం 8 గంటలకు పీహెచ్‌సీ కేంద్రానికి చేరుకున్నారు. ఆమె వెంట నానమ్మ లక్ష్మమ్మ, బంధువులు దేవేంద్ర, స్వామిదాస్, హనుమంతమ్మ ఉన్నారు. అయితే ఆ సమయంలో ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ఒక్కరంటే ఒక్కరూ అందుబాటులో లేకపోయారు. ఒకవైపు నొప్పులతో గర్భిణి పవిత్ర అల్లాడిపోతూ కేకలు పెడుతున్నారు. ఆస్పత్రి సిబ్బందికి, ఉన్నతాధికారులకు ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదు. పవిత్ర పరిస్థితి విషమంగా మారడంతో చివరకు బంధువులే ఆస్పత్రిలోని లేబర్ రూంకు తీసుకెళ్లి తమకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో కాన్పు చేశారు. పవిత్ర ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
గ్రామ పెద్ద రాకతో కదలిక
తీవ్ర ఆందోళన చెందిన పవిత్ర అన్న స్వామిదాస్ గ్రామ పెద్ద ఆదినారాయణ రెడ్డికి ఫోన్ చేసి సమా చారం అందించారు. ఆయన హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని సిబ్బంది విధులపై ఆరా తీశారు. అనంతరం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సత్యవతిని ఫోన్‌లో సంప్రదించగా పొంతన లేని సమాధానం రావడంతో పవిత్ర బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అత్యవసర సమయంలో సిబ్బంది ఎక్కడ?
ప్రసవం వంటి అత్యవసర పరిస్థితుల్లో వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సకాలంతో వైద్య సహాయం అందకపోవడంతో బంధువులే ప్రసవం చేయాల్సి రావడం ఆందోళన కలిగించే అంశమని గ్రామస్తులు అంటున్నారు. ఏదైనా అనుకోని ఘటన జరిగి ఉంటే తల్లి, శిశువు ప్రాణాలకు ముప్పు ఏర్పడేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పెద్ద హరివాణం పీహెచ్‌సీలో
దారుణ స్థితి
డాక్టర్లు లేరు.. వైద్య సిబ్బంది
ఒక్కరూ లేరు
తల్లి, బిడ్డ ప్రాణాలతో చెలగాటం
ఉన్నతాధికారులు
విచారణ చేయాలని డిమాండ్


