మంత్రాలయం రూరల్: టీడీపీ పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమవుతోంది. పాఠశాలల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. నిర్వహణకు నిధులు విడుదల చేయకపోవడంతో చాలా బడుల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
చెట్ల కింద విద్యార్థులు చదువుతున్న ఈ దృశ్యం మంత్రాలయం మండలం సూగూరు గ్రామంలోనిది. గ్రామ కొత్త కాలనీ దారిలో ఎంపీపీ (డిపెప్) పాఠశాల ఇది. ఇక్కడ 187 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఒకటి నుంచి ఐదు తరగతులకు పాఠశాలలో నాలుగు గదులు ఉన్నాయి. అందులో ఒకటి పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో ఆ గదికి తాళం వేశారు. మిగిలిన మూడు గదులను విద్యాబోధనకు వినియోగిస్తున్నారు. అందులో ఓ గదిలో హెచ్‌ఎం గది కూడా పెట్టుకున్నారు. ఐదు తరగతులకు కేవలం మూడు గదులు మిగిలాయి. మిగతా తరగతులను స్కూలు ఆవరణలో చెట్ల కింద నడుపుతున్నారు. వానొస్తే అన్ని తరగతులను కలిపేసి బోధన కానిస్తున్నారు. చెట్ల కింద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వరండాలోనూ ఓ తరగతి నడుపుతున్నారు. పాఠశాల భవనం చూడటానికి పాడుబడ్డ బంగ్లాను తలపిస్తోంది. గతంలో మూడు తరగతి గదులకు పైకప్పు వేసేసి చేతులు దులుపుకున్నారు. పాఠశాలకు ఎలాంటి రంగులు వేయలేదు. చెట్ల కింద బోధన విద్యార్థుల చెవికెక్కని పరిస్థితి. స్కూల్‌కు కాంపౌండ్ వాల్ లేకపోవడంతో పందులు ఆవరణలో తిరుగుతుంటాయి. మరుగుదొడ్ల నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఉపాధ్యాయులతో సహా విద్యార్థులు బహిర్భూమికి వెళ్లాల్సిన దుస్థితి. పాఠశాల సమస్యలను అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు ఆందోళన వ్య క్తం చేస్తున్నారు. వెంటనే పాఠశాలకు మరమ్మతులు చేసి, సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.


