మంత్రాలయం రూరల్: తీవ్ర వర్షాభావం రైతన్నలను కుంగదీస్తోంది. నదీ జలాలపై ఆధారపడ్డ రైతన్నల కంట కన్నీరు నింపుతోంది. నట్టేట నష్టాల మూటను కూడ బెడుతోంది. అందుకు తార్కాణమే ఈ రైతు ఘోష. చెట్నేహళ్లి గ్రామ శివారులోని మోహినిపురం పొలాల్లో కాపురం ఉంటున్న విఠల్‌బాబు తన సొంత పొలం కాకుండా దాదాపు 42 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. తుంగభద్ర నదీ జలాలపై ఆధారపడి ఏటా ఇలా కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నాడు. కాలాన్ని నమ్ముకుని ఈ ఏడాది కూడా 42 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వరి పంట వేశాడు. తన సొంత భూమిలో మూడు ఎకరాల్లోనూ ఇదే పంట సాగు చేశాడు. అయితే వర్షాభావ పరిస్థితులతో నదిలో జలాలు అడుగంటిపోయాయి. దీంతో తాను కౌలుకు చేసిన పొలానికి సాగునీరు మృగ్యమైంది. పంటను కాపాడుకునేందుకు నెలల తరబడి ఎంతగానో శ్రమించారు. పంట పొట్టు దశకు చేరిన సమయంలో పైరు పూర్తిగా ఎండిపోయింది. చేసేది లేక రైతు కలత చెంది వరి పైరును గొర్రెలకు మేతగా వదిలేశాడు. మంగళవారం ఈ దృశ్యం పలువురిని కలచి వేసింది. పెట్టిన పెట్టుబడి అంతా నేలపాలు కావడంతో రైతు కన్నీరుమున్నీరయ్యాడు. నష్టాల నుంచి ఎలా గట్టెక్కాలో దిక్కుతోచడం లేదని వాపోయాడు. ఎకరాకు రూ.30 వేలు ఖర్చుచేశానని, 18 ఎకరాల పైరును గొర్రెలకు మేతగా వదలాల్సి వచ్చిందని బాధిత రైతు గోడును వినిపించారు.
– గొర్రెలకు మేతగా 18 ఎకరాల వరి పైరు
– కౌలు రైతుకు తీరని నష్టం


