ఆదోని రూరల్: మండలంలోని పెద్దతుంబలం గ్రామ సమీపంలో ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వద్ద మంగళవారం ట్రాక్టర్ అదుపుతప్పిన ప్రమాదంలో డ్రైవర్ శంకరయ్య (24) మృతిచెందాడు. ఘటనకు సంబంధించి పెద్దతుంబలం పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోసిగికి చెందిన ట్రాక్టర్ (ఏపీ 21 ఏ1 1340) యజమాని నరసయ్య తన ఇంటి నిర్మాణం కోసం పెద్దతుంబలంలో ఉన్న ఇటుకల బట్టి వద్ద ఇటుకలను లోడ్ చేసుకుని వెళ్లడానికి డ్రైవర్ గిడ్డయ్యతో పాటు వచ్చారు. ట్రాక్టర్ లోడు చేసుకుని తిరిగి వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కనున్న గుంతలోకి దూసుకెళ్లింది. డ్రైవర్ శంకరయ్య కింద పడగా ఆయనపై ట్రాక్టర్ ఇంజన్ టైర్లు ఎక్కడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పెద్దతుంబలం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి తల్లిదండ్రులు అంజినమ్మ, తిమ్మప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దంపతులకు ఐదుగురు సంతానంలో శంకరయ్య రెండో కుమారుడు. అతనికి ఇంకా వివాహం కాలేదు.
వర్మీ ఉత్పత్తి జరగకుంటే చర్యలు
కర్నూలు(అర్బన్): జిల్లాలోని వర్మీ కంపోస్టు షెడ్ల నుంచి వర్మీ ఎరువు ఉత్ప త్తి జరగకుంటే చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి జీ.భాస్కర్ హెచ్చరించారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలోని మొత్తం 484 గ్రామ పంచాయతీల్లో ఇప్పటివరకు 420 గ్రామ పంచాయతీల్లో వర్మీ కంపోస్టు షెడ్లు ఏర్పాటయ్యాయని, వీటిలో 332 షెడ్ల నుంచి మాత్రమే ఇప్పటివరకు వర్మీ ఎరువుల ఉత్పత్తి జరుగుతోందన్నారు. మి గతా 88 షెడ్ల నుంచి వర్మీ ఎరువుల ఉత్పత్తి జరగడం లేదని, ఈ షెడ్ల నుంచి రెండు నెలల్లోపు వర్మీ ఎరువు ఉత్పత్తి కాకుంటే సంబంధిత పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామన్నారు. 120 షెడ్ల నుంచి వంద శాతం వర్మీ ఎరువు ఉత్పత్తి జరుగుతోందని, మిగతా షెడ్ల నుంచి ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వర్మీ ఎరువు ఉత్పత్తిలో ప్రతిభ కనబరిచిన పంచాయతీ కార్యదర్శులకు విజయదశమి పర్వదినం సందర్భంగా బహుమతులు అందించనున్నట్లు వెల్లడించారు. స్థానికంగా వర్మీ ఉత్పత్తులను కొనుగోలు చేయని పక్షంలో మార్క్‌ఫెడ్ సంస్థ వర్మీ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని షెడ్ల నుంచి వర్మీ ఉత్పత్తులను పెంచేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.


