ఆదోని అర్బన్: పట్టణంలోని అమరావతి నగర్‌లో పొలంలో వ్యక్తి గొంతు కోసి హత్య చేసిన కేసును వన్‌టౌన్ పోలీసులు ఛేదించారు. ఈ మేరకు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఇద్దరు నిందితులను అరెస్టు చేసి మీడియాకు చూపుతూ సీఐ చంద్రశేఖర్ వివరాలు వెల్లడించారు. అమరావతి నగర్‌లో నివసించే అక్కాచెల్లెళ్లు అఖిలను చిన్నహరివాణం గిడ్డయ్య గారి వీరేష్, చెల్లెలు శైలజను అరికెర గ్రామానికి చెందిన వీరేష్ పెళ్లి చేసుకున్నారు. అయితే బావ గిడ్డయ్య గారి వీరేష్‌కు మరదలు శైలజతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న అరికెర వీరేష్ భార్య శైలజను కొట్టి వేధించేవాడు. ఈ బాధను శైలజ బావకు ఫోన్‌లో చెప్పుకునేది. పది రోజుల క్రితం బాధను తట్టుకోలేక నువ్వైనా చచ్చిపో, నన్నైనా చంపు లేదా నా భర్తనైనా చంపు అని రెచ్చగొట్టింది. ఈ క్రమంలో సెప్టెంబరు 18న ఆదోనిలో గణేష్ నిమజ్జనం కోసం ఇద్దరు అల్లుళ్లు అమరావతి నగర్‌కు వచ్చారు. రాత్రి డ్యాన్స్‌కు వెళ్లిన అరికెర వీరేష్ తన భార్యను కూడా రమ్మని పిలిచాడు. బిడ్డ ఏడుస్తుందని, రానని చెప్పడంతో కోపంతో కాలితో తన్నాడు. శైలజకు నొప్పి ఎక్కువ కావడంతో ఆసుపత్రికి వెళ్లి వచ్చారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన గిడ్డయ్య గారి వీరేష్ మరదలు మాటలు గుర్తుకు తెచ్చుకుని అరికెర వీరేష్‌ను చంపాలని నిర్ణయించుకున్నాడు. అదేరోజు అర్ధరాత్రి బహిర్భూమికి వెళ్దామని చెప్పి బయటకు తీసుకెళ్లి లుంగీతో గొంతు బిగించి, తర్వాత కత్తితో పొడిచి గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు. ఈ కేసులో నిందితుడు గిడ్డయ్యగారి వీరేష్‌పై హత్య నేరం, హత్యకు ప్రేరేపించిన శైలజపై కేసు నమోదు చేశారు. ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు.


