కొలిమిగుండ్ల: మండల కేంద్రం కొలిమిగుండ్లలో ఇంటి నిర్మాణం కోసం తవ్విన గుంతలో మంగళవారం ప్రమాదవశాత్తు పడి ఓ బాలుడు మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి.. అవుకు మండలం చెర్లోపల్లెకు చెందిన కంబగిరిస్వామి, అమరావతి దంపతుల కుమారుడు అజిత్(8) అవ్వగారి ఊరైన కొలిమిగుండ్లలో ఉంటు బీసీ ప్రాథమిక పాఠశాలలో నాల్గవ తరగతి చదువుతున్నాడు. సాయంత్రం ఐదు గంటల సమయంలో మినరల్ వాటర్ తీసుకొని వస్తానని లలితా సుందరేశ్వరస్వామి ఆలయం ఎదురుగా ఉన్న వాటర్ ప్లాంట్ వద్దకు బయలు దేరాడు. ఈ కోవలోనే అదే వీధిలో కొత్తగా ఇంటి నిర్మాణం కోసం తవ్విన గుంతలో ప్రమాద వశాత్తు కాలు జారి పడిపోయాడు. వర్షాలు కురుస్తుండటంతో గుంతలో నీరు నిల్వ చేరాయి. నీళ్ల కోసమని పోయిన బాలుడు ఎంతకి ఇంటికి రాక పోవడంతో అవ్వ చుట్టు పక్కల వెతికింది. కనిపించక పోవడంతో విషయాన్ని తల్లిదండ్రులకు సమాచారం చేరవేయడంతో కొలిమిగుండ్లకు చేరుకొని ప్రధాన రహదారిలో దుకాణాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో బాలుడి ఆచూకీ కోసం వెతికినా కనిపించలేదు. చివరకు బాలుడు ఉండే వీధి సమీపంలోని గుంతలో లైట్ల సాయంతో వెతుకుతుండగా కాళ్లు కనిపించాయి. హుటాహుటిన స్థానికంగా ఉన్న ఓ ప్రవేట్ ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే మృతి చెందాడు. అవ్వ ఒంటరిగా ఉండటంతో తోడుగా ఉండి చదువుకుంటున్న కుమారుడి అకాల మరణం చెందడంతో తల్లితండ్రులు బోరున విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.


