కర్నూలు(సెంట్రల్): జిల్లాలో హెచ్‌ఐవీ నియంత్రణకు వైద్య ఆరోగ్య శాఖాధికారులు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో కలెక్టర్ ఎయిడ్స్ సురక్ష అంశంపై వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. హెచ్‌ఐవీ వ్యక్తులను గుర్తించి అవసరమైన పరీక్షలు, చికిత్స, కౌన్సెలింగ్ అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా హైరిస్క్ గ్రూపులను గుర్తించి విస్తృతంగా పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇందుకోసం మొబైల్ ఐసీటీసీ వాహనాల ద్వారా కీలక ప్రాంతాల్లో పరీక్షల సంఖ్యను పెంచాలని సూచించారు. చికిత్సకు దూరమైన లాస్ట్ టు ఫాలో అప్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి నెలా ఫోన్‌లో వారిని సంప్రదించి, వారి పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు అవసరమైన కౌన్సెలింగ్ అందించి తిరిగి క్రమం తప్పకుండా చికిత్స పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. హెచ్‌ఐవీ బాధితులు క్రమం తప్పకుండా ఇఈ4, వైరల్ లోడ్ పరీక్షలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని, మందులను నిరంతరాయంగా వినియోగించేలా కౌన్సెలింగ్ ఇవ్వాలని కలెక్టర్ వైద్య అధికారులను ఆదేశించారు. కేర్ సపోర్ట్ సెంటర్ల ద్వారా రోగుల చిరునామా ధ్రువీకరణ, లాస్ట్ ఫర్ ఫాలోఅప్ కేసులను గుర్తించి తిరిగి చికిత్స పరిధిలోకి తీసుకురావడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ కామేశ్వరప్రసాద్, జిల్లా లేప్రసీ, ఎయిడ్స్ – టీబీ అధికారి డాక్టర్ భాస్కర్, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ అలీ హైదర్, ఏఆర్‌టీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అభిగేయల్ పాల్గొన్నారు.


