డీజే సౌండ్ సిస్టమ్‌ల ద్వారా వచ్చే అధిక తీవ్రత గల శబ్దాలు గుండెకు చేటు చేస్తాయి. ఇప్పటికే గుండెజబ్బులున్న వారికి, హైబీపీ ఉన్న వారికి ఇబ్బంది కలిగిస్తాయి. వారి బీపీ, గుండెవేగంలో మార్పులు వచ్చి తీవ్ర అనారోగ్యానికి గురిచేస్తాయి. ఇవి కొన్నిసార్లు ప్రాణాంతకం అవుతాయి. డీజే సౌండ్ సిస్టమ్‌ల వద్ద ఎక్కువ సేపు నృత్యం చేసే యువకుల్లోనూ అడ్రినలిన్, కార్టిసాల్ ఎక్కువ విడుదలై బీపీ, హార్ట్‌రేట్ పెరిగి సడన్‌గా హార్ట్ ఎటాక్ వచ్చి మనిషి మరణించే అవకాశం ఉంటుంది. –డాక్టర్ బి. కిరణ్‌కుమార్‌రెడ్డి,
కార్డియాలజిస్టు, జీజీహెచ్, కర్నూలు
డీజే సౌండ్ సిస్టమ్‌లు విపరీతమైన శబ్దాలు చేస్తాయి. కొన్నిసార్లు ఇవి 100కు పైగా డెసిబుల్స్ శబ్దాన్ని విడుదల చేస్తాయి. ఇవి మనిషి చెవి తట్టుకునే దానికి రెండు, మూడింతలు ఎక్కువగా ఉంటుంది. ఇంతటి విపరీతమైన ధ్వనితో శరీరంలో కొన్నిసార్లు ఊహించని మార్పులు వస్తాయి. వినికిడి సమస్య వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. డీజే సౌండ్ సిస్టమ్ ఉంటే సాధ్యమైనంత వరకు దానికి దూరంగా ఉంటే మేలు.
–డాక్టర్ ఎస్.శశికిరణ్, ఈఎన్‌టి వైద్యులు, కర్నూలు
కర్నూలు(హాస్పిటల్): ఉత్సవం ఏదైనా, శుభకార్యం ఎలాంటిదైనా, పండుగైనా, పెళ్లి ఊరేగింపు అయినా ఇప్పుడు డీజే సౌండ్ ఉండాల్సిందే. డీజే స్పీకర్లు అమర్చిన వాహనం ముందు వెళ్తుండగా దాని వెనుక నృత్యాలు చేయడం ఇప్పుడు ఆనవాయితీగా మారింది. డీజే లేనిదే శుభకార్యానికి ఊపు రాదనే అభిప్రాయం వచ్చేసింది. అందుకే చిన్న వారైనా, పెద్ద వారైనా సరే డీజే సౌండ్ సిస్టమ్ వెంట బెట్టుకుని మరీ నృత్యాలు చేస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు గంటల తరబడి ఆ శబ్దాల ముందు ఉంటూ నృత్యాలు చేసి అలసి సొలసి సొమ్మసిల్లుతుండగా, మరికొందరి గుండెపోటుతో మృత్యువాతపడుతున్నారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వినాయక నిమజ్జనం ఉత్సవాల్లో డీజేలను ఏర్పాటు చేశారు. ప్రతి డీజే నుంచి వందకు పైగా డిజిబుల్స్ శబ్దం విడుదలై జనాన్ని విసుగెత్తిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో డీజే సౌండ్ సిస్టమ్‌లు వరుస క్రమంలో మోత మోగిస్తుంటే ఆ శబ్దకాలుష్యాన్ని భరించలేక, ఎవరికి చెప్పుకోవాలో అర్థం గాక జనం నరకయాతన అనుభవిస్తున్నారు. వివాహం సందర్భంగా రాత్రిళ్లు నిర్వహించే మెరవణిలో ఏర్పాటు చేసిన డీజేలు రాత్రంతా ఆ ప్రాంత వాసులకు నిద్రలేకుండా చేస్తుందంటే అతిశయోక్తి కాదు.
డీజేల మోతను ప్రశ్నించేవారు కరువు
సాధారణంగా మనిషి చెవి 60 నుంచి 70 డెసిబుల్స్ మాత్రమే వింటుంది. దానికి మించితే ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. డెసిబుల్స్ వంద దాటితే ప్రాణాలు పోయే అవకాశాలు ఎక్కువ. ఇటీవల జిల్లాలో నిర్వహించిన పలు ఉత్సవాల్లో ఒక్కో డీజే సౌండ్ సిస్టమ్ విడుదల చేసిన శబ్ద తీవ్రత 110 నుంచి 140 దాకా డెసిబుల్స్ శబ్దాలను విడుదల చేశాయి. అంతటి తీవ్రత ఉన్న శబ్దాల వద్ద గంటల తరబడి ఆడుతూ ఉంటే కొన్ని సున్నిత హృదయాలు మా చేతకాదంటూ ఆగిపోతున్నాయి. ఫలితంగా చిన్న వయస్సులోనే యువకులు కన్నుమూస్తున్నారు. డీజేల వద్ద నృత్యాలు చేసే విషయంలోనూ ఘర్షణలు జరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం డీజేలు ఏర్పాటు చేయాలంటే సంబంధిత ప్రాంత పోలీస్ స్టేషన్‌లో పోలీసులు అనుమతులు ఇవ్వాలి. కానీ ఏ ఒక్కరూ అనుమతులు తీసుకోవడం లేదు. అయినా డీజేలు పెట్టినా ఏ ఒక్కరూ ప్రశ్నించడం లేదు.
తీవ్ర అనారోగ్య సమస్యలు
అధిక శబ్దాలతో వచ్చే డీజే సౌండ్ సిస్టమ్‌లు తీవ్ర అనారోగ్యానికి గురిచేస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డీజేల ముందు గంటల తరబడి నృత్యాలు చేయడం వల్ల వినికిడి సమస్యలతో పాటు గుండె సమస్యలు, మానసిక సమస్యలు, చిన్నారులు, వృద్ధుల నిద్రాభంగం ఏర్పడి అనారోగ్యానికి, హృద్రోగానికి దారి తీస్తోంది. అధిక శబ్దాలు చేస్తూ వెళ్లే వాహనాలను నియంత్రించే అధికారులు డీజేలను ఎందుకు వదిలేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. డీజేలతో తమ ప్రాణాల మీదకు వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలు పాటించే వారేరి?
అనుమతులు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో సభలు, సమావేశాలు ఏర్పాటు చేయకూడదు. చేసినా వాటిలో డీజే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయకూడదు.
ప్రైవేటు ప్రదేశాలు(ఇల్లు, హాళ్లు)లో డీజే శబ్దాలు చేయరాదు.
లిఖిత పూర్వక అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు, సౌండ్ బాక్స్‌లు వాడకూడదు.
నిషిద్ధ ప్రాంతాలుగా గుర్తించిన ప్రదేశాల్లో సంగీత ధ్వనులు, డ్రమ్స్ కొట్టడం, ఇతర శబ్దాలు చేయకూడదు.
సినిమా థియేటర్‌లలో సైతం 65 డెసిబుల్స్‌కు మించి శబ్దం రాకూడదు.
వైద్యశాలలు, విద్యాసంస్థలు, దేవాలయాలు, న్యాయస్థానాలకు వంద మీటర్ల పరిధిలోని ప్రాంతాలను నిషిద్ధ ప్రాంతాలుగా పరిగణిస్తారు. ఇక్కడ శబ్దాలు చేయడంపై నిషేధం విధించారు.
భారీ శబ్దాలతో
తనువు చాలిస్తున్న ప్రజలు
డీజేలు ఉండాలన్న మంత్రి లోకేష్
జిల్లాలో వీటి వాడకం నిత్యకృత్యం
పట్టించుకోని పోలీసులు, అధికారులు


