● రిటైర్డ్ అధికారి వద్దనే దేవస్థాన
బంగారం, వెండి ఆభరణాల లాకర్
● మూడు నెలలు గడుస్తున్నా
తీసుకోని నూతన డీఈవో
శ్రీశైలంటెంపుల్: దేవస్థానానికి చెందిన బంగారం, వెండి ఆభరణాలతో పాటు ఇతర విలువైన వస్తువులు ఉండే ఎస్‌బీఐ బ్యాంక్ లాకర్ రిటైర్డ్ అయిన డిప్యూటీ కార్యనిర్వహణాధికారి వద్దనే ఉంది. వాటిని ఇంకా తిరిగి తీసుకోలేదు. శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు కానుకల రూపంలో భక్తులు బంగారం, వెండి ఆభరణాలను, ఇతర విలువైన వస్తువులను సమర్పిస్తారు. వాటిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లాకర్‌లో భద్రపరుస్తారు. గతంలో ఈ బాధ్యత దేవస్థాన కార్యనిర్వహణాధికారి చూసుకునేవారు. అయితే దేవస్థానానికి డిప్యూటీ కార్యనిర్వహణాధికారి పోస్టు మంజూరు చేయడంతో ఈ బాధ్యతలు అప్పగించారు. గతంలో శ్రీశైల దేవస్థానంలో విధులు నిర్వహించిన డీఈవో ఆర్.రమణమ్మ మే 31న పదవీ విరమణ పొందారు. అనంతరం బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్ బంగారం, వెండి అభరణాలు, విలువైన వస్తువుల లాకర్‌ను స్వాధీనం చేసుకోవాలి. అయితే వంద రోజులు పైనే గడుస్తున్నా ఇంతవరకు తీసుకోలేదు. పర్యవేక్షించాల్సిన దేవస్థాన ఉన్నతాధికారి సైతం నిర్లక్ష్యం ప్రదర్శించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయమై డీఈఓ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. గత పది రోజుల క్రితమే రిటైర్డ్ అయిన డీఈవో దేవస్థాన బంగారం, వెండి ఆభరణాలు, విలువైన వస్తువుపై తిరిగి ఇచ్చేందుకు లేఖ రాశారని తెలిపారు. కర్నూలుకు చెందిన జ్యూవెలరీ వెరిఫికేషన్ అధికారికి లేఖ రాశామని, ఈ నెల అఖరులోపు లాకర్‌ను తీసుకుంటామని తెలిపారు.


