● ‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటుదాం ● మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
కౌతాళం: సమరానికి సిద్ధం కావాలని, ఐక్యంగా ఉంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం అని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. శనివారం రాత్రి స్థానిక వైఎస్సార్‌పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. అంతకు ముందు సుమారు వెయ్యి ద్విచక్ర వాహనాలతో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు స్వాగతం చెప్పారు. కస్తూర్బా పాఠశాల నుంచి బైకు ర్యాలీ నిర్వహించారు. స్థానిక వైఎస్సార్ సర్కిల్‌లో మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద 15 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంటు రోడ్డు, డ్రైనేజీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. పార్టీ మండల కన్వీనర్ ప్రహ్లాదచారి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు దాట్ల కృష్ణంరాజు, మాజీ సింగల్ విండో అధ్యక్షుడు వీరసేనరెడ్డి, రౌడూరు సుధాకర్‌రెడ్డి, ఏకాంబర్‌రెడ్డిలతో కలిసి ఆలయంలో పూజలు చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యకర్తలకు ఐడీ కార్డులను పంపిణీ చేశారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో
రైతులకు న్యాయం
రైతులకు, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసింది ఒక్క వైఎస్సార్‌సీపీ మాత్రమేనని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. తుంగభద్ర డ్యాంలో 84 టీఎంసీల నీరు ఉన్న రైతులకు ఇచ్చామని, ప్రజలందరికీ తాగునీరు అందించామన్నారు. ఇప్పుడు ఒక్క పంటకు కూడా నీరు ఇవ్వలేని పరిస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని విమర్శించారు. రెండున్నర సంవత్సరాల కాలంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. ఇప్పుడు పింఛన్లు అంటూ హడావుడి చేస్తున్నారని, మండలానికి ఎన్‌ఆర్‌జీఎస్ నిధులతో రెండున్నర కోట్ల పనులు అంటూ కల్లబొల్లి చెబుతున్నారన్నారు. ఇలాంటి వెన్నుపోటు ప్రభుత్వాన్ని తాను ఎప్పుడూ చూడలేదన్నారు.
ఐక్యంగా ఉంటూ సత్తా చాటుదాం
వైఎస్సార్‌సీపీలో ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఇప్పుడు జగన్–2ను చూస్తారని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తయినా ఆ పార్టీలో కార్యకర్తలు సుఖంగా లేరని, కేవలం నాయకులు మాత్రమే ఉన్నారన్నారు. ఈ సారి ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు కూడా వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేస్తారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ పాలనలో ఐదు సంవత్సరాల పాటు చేసిన అభివృద్ధిని వివరించి ఓటు అడగాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఐక్యంగా ఉంటూ సత్తా చాటాలన్నారు.
ఏడు కాదు 140 గ్రామాలు బాలనాగిరెడ్డివే!
ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు మాధవరం వచ్చి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి పట్టుగా ఉన్న ఏడు గ్రామాల్లో ఈసారి గెలుస్తామని కల్లిబొల్లి మాటాలు చెప్పారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి మహేందర్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి ఏడు గ్రామాలు కాదు నియోజకవర్గంలో 140 గ్రామాలు ఉన్నాయన్నారు. సమావేశంలో కో–ఆప్షన్ మెంబర్ మాబుసాబ్, వైస్ ఎంపీపీ బుజ్జీస్వామి, నాయకులు రాఘవేంద్రరెడ్డి, నదిచాగి రామన్నగౌడ్, హాల్వి బసవప్రభు, అనిల్, శివరాం, అబ్దుల్ సమద్, కౌతాళం మాజీ సర్పంచ్‌లు అవతారం, పాల్‌దినకర్, వడ్డెరాము, ప్రహ్లాదరెడ్డి, ఆయా గ్రామాల ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచ్‌లు, కార్యకర్తలు పాల్గొన్నారు.


