కర్నూలు (సెంట్రల్): పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని ఉపాధి కల్పన, స్కిల్ డెవలప్మెంట్ అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. తన కార్యాలయంలో విద్య, నైపుణ్యాభివృద్ధి అంశాలపై శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువతకు పది రోజుల్లో శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలన్నారు. పీఎంకేవీవై (ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన) కింద ఇచ్చిన లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్నారు. జాబ్ మేళాల్లో ఎంపికయ్యే అభ్యర్థుల సంఖ్యను పెంచాలన్నారు. విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు అధికారులు సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. ప్రతి పాఠశాలలో 90 శాతం ఉత్తీర్ణత సాధించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలన్నారు. సమావేశంలో సీపీఓ భారతి, డీఈఓ సుధాకర్, సర్వ శిక్ష అభియాన్ పీఓ లోకరాజ్, ఉపాధి కల్పనాధికారి దీప్తి, ఆర్‌ఐఓ లాలప్ప, స్కిల్ డెవలప్మెంట్ అధికారి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


