సమయపాలన పాటించకపోతే చర్యలు | - | Sakshi
Sakshi News home page

సమయపాలన పాటించకపోతే చర్యలు

Sep 6 2026 1:37 AM | Updated on Sep 6 2026 1:37 AM

సచివాలయాల సిబ్బందికి

కలెక్టర్‌ హెచ్చరిక

కర్నూలు(సెంట్రల్‌): స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల సిబ్బంది తప్పనిసరిగా నిర్దేశించిన సమయానికి విధులకు హాజరు కావాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి ఆదేశించారు. శనివారం ఆమె కలెక్టరేట్‌ నుంచి మండల స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల తనిఖీ చేసిన సమయంలో సిబ్బంది హాజరు 62 శాతం మాత్రమే నమోదైనట్లు గుర్తించామన్నారు. ప్రజలకు అవసరమైన సేవలు సకాలంలో అందించేందుకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తప్పనిసరిగా సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. హాజరులో నిర్లక్ష్యం కనిపిస్తే సంబంధిత మండల స్థాయి అధికారిపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యాలయాల్లో వివిధ రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించడం లేదని, నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో జిల్లా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారి భాస్కర్‌ నాయుడు, అదనపు మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణ, మండల స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

కర్నూలు(సెంట్రల్‌): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఉదయం 9.30 గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్‌, మునిసిపల్‌ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడానికి కాల్‌ సెంటర్‌ నంబర్‌ 1100కు ఫోన్‌ చేయవచ్చన్నారు. అలాగే meekosam.a p.gov.in అనే వెబ్‌సైట్‌లోనూ అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

ఆర్‌యూ నుంచి విద్యార్థి బహిష్కరణ

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ యూనివర్సిటీ నుంచి ఒక విద్యార్థిని బహిష్కరిస్తూ వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌ కార్యాలయం నుంచి శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. వర్సిటీ కళాశాలలో తెలుగు పీజీ మూడవ సెమిస్టర్‌ చదువుతున్న సుగాలి కృష్ణ నాయక్‌ను వర్సిటీ నుంచి బహిష్కరించారు. ఈనెల 2న వర్సిటీలో అధికారులు, సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగడం, అభ్యంతరకర భాషను ఉపయోగించడం లాంటి కారణాలతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వర్సిటీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కేసీ కెనాల్‌కు

కృష్ణా జలాలు

పగిడ్యాల: ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కేసీసీ లిఫ్ట్‌ నుంచి రెండు మోటర్ల ద్వారా కేసీ కెనాల్‌కు కృష్ణా జలాలను విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ ఏఈఈ వీరమ్మ శనివారం తెలిపారు. కేసీ కాలువ పరివాహక గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చడానికి పది రోజుల పాటు నీటి సరఫరా కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కొక్క మోటార్‌ నుంచి 240 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువ ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలకు మాత్రమే విడుదల చేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. అలాగే మల్యాల లిఫ్ట్‌ నుంచి 330 క్యూసెక్కుల నీటి సరఫరా కొనసాగుతుందని తెలిపారు. అయితే కేసీ కాలువకు సాగునీరు విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ నాయకులు ఉరితాళ్లతో నిరసన చేసిన ఐదు రోజుల వ్యవధిలోనే అధికారులు నీటి విడుదల చేయడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

లాకిన్స్‌లా వద్ద లాకులు

జూపాడుబంగ్లా: కేసీ కాల్వకు ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి 480, మల్యాల నుంచి 325 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 120 కిలోమీటరు వద్ద నుంచి నిప్పులవాగు, తూడిచెర్ల సబ్‌ఛానల్‌ కాల్వకు వెళ్లకుండా అధికారులు లాకిన్స్‌లా వద్ద లాకులు మూసివేశారు. ఈ విషయమై కేసీ కాల్వ ఏఈ శ్రీనివాసనాయక్‌ మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాలు వెలువడిన తర్వాత దిగువ కాల్వలకు నీటిని సరఫరా చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement