● స్థానికంగానే ఉన్నా కన్నెత్తి చూడని
మంత్రి టీజీ భరత్
● గ్రూప్ ఫొటోకు మాత్రమే హాజరైన కలెక్టర్
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు నివాళులర్పిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే, అధికారులు
ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన
కర్నూలు(సెంట్రల్): జిల్లా స్థాయి గురుపూజోత్సవ కార్యక్రమాన్ని శనివారం తూతూమంత్రంగా నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి కలెక్టరేట్‌లోనే అందుబాటులో ఉన్నా మిగతా పనులతో బిజీగా ఉండి రాలేకపోయారు. దీంతో డీఈఓ ఎల్.సుధాకర్ అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించగా ఆర్‌ఐఓ లాలెప్ప, సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ లోకరాజు హాజరై జ్యోతిప్రజ్వలన, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అయితే మధ్యలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కర్నూలు ఎంపి బస్తిపాటి నాగరాజు రావడంతో మరోసారి సర్వేపల్లి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీ రెండు నిమిషాలు మాట్లాడి ఇతర పనులు ఉన్నాయంటూ వెళ్లిపోయారు. చివరగా కలెక్టర్ గ్రూప్ ఫొటో దిగడానికి మాత్రమే వచ్చి మమ అనిపించడం గమనార్హం. కార్యక్రమంలో మొత్తం 48 మంది జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు శాలువా కప్పి మెమొంటోతో సన్మానించారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ తాను కూడా ఒకప్పుడు లెక్చరర్‌గా పనిచేశానని, ఉపాధ్యాయులే సమాజ మార్గనిర్దేశకులని అన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మాట్లాడుతూ విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను బోధించాలన్నారు. కార్యక్రమంలో బీక్యాంపు గర్‌ల్స్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు వందేమాతరం గేయాన్ని, శారద నృత్య కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పార్వతమ్మ, డీవైఈఓ శ్రీధర్ పాల్గొన్నారు.


