హైకోర్టు బెంచ్‌ సాధనకు ఉద్యమం ఉధృతం | - | Sakshi
Sakshi News home page

హైకోర్టు బెంచ్‌ సాధనకు ఉద్యమం ఉధృతం

Sep 6 2026 1:37 AM | Updated on Sep 6 2026 1:37 AM

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో

న్యాయవాదులు, రాజకీయ పక్షాల నిర్ణయం

కర్నూలు: శాశ్వత హైకోర్టు బెంచ్‌ సాధన కోసం ఉద్యమం మరింత ఉధృతం చేయాలని న్యాయవాదులు, రాజకీయ పక్షాలు నిర్ణయించాయి. న్యాయవాదుల సంఘం భవనంలో శనివారం నిర్వహించిన ప్రజాసంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌, బీఎస్పీ, విద్యార్థి, రైతు, కార్మిక, సామాజిక సేవా సంఘాల ప్రతినిధులు, ఉద్యమకారులు సమావేశంలో పాల్గొని న్యాయవాదుల ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని తమ వంతు సహకారం అందిస్తామని ఆయా రాజకీయ పక్షాలు, సంఘాల ప్రతినిధులు స్పష్టంగా హామీ ఇచ్చారు. న్యాయవాదుల దీక్షకు మద్దతుగా రాజకీయ పక్షాల ప్రతినిధులు కూడా పాల్గొంటారని హామీ ఇచ్చారు.

13వ రోజు కొనసాగిన

న్యాయవాదుల దీక్షలు...

శాశ్వత హైకోర్టు బెంచ్‌ కర్నూలులో ఏర్పాటు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరాహారదీక్షలు 13వ రోజు కూడా కొనసాగాయి. శాశ్వత హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేసేవరకు ఉద్యమం కొనసాగిస్తామని న్యాయవాదులు స్పష్టం చేశారు. అనిశెట్టి నీరజ, ఎస్‌.మహమ్మద్‌ అన్వర్‌ సాదత్‌, గోపాల్‌ యాదవ్‌, ఈడిగ బుద్దిరాజు గౌడ్‌, గైక్వాడ్‌ భరత్‌ కుమార్‌, షేక్‌ మాసూం వలి, పీఎస్‌ హరీష్‌ రెడ్డి తదితరులు శనివారం నిర్వహించిన రిలే నిరాహారదీక్షల్లో పాల్గొన్నారు.

సోమవారం జనరల్‌ బాడీ సమావేశం

శాశ్వత హైకోర్టు బెంచ్‌ సాధన కోసం తదుపరి కార్యాచరణను నిర్ణయించేందుకు సోమవారం న్యాయవాదుల జనరల్‌ బాడీ సమావేశం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు చంద్రుడు తెలిపారు. ప్రధాన కార్యదర్శి మహేశ్వర రెడ్డి, ఉపాధ్యక్షుడు రసూల్‌ ఖాన్‌, సీనియర్‌ న్యాయవాదులు రామసుబ్బారెడ్డి, జయరాజు, బి.మురళీమోహన్‌, సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement