బీసీ రిజర్వేషన్ల పేరుతో రెండేళ్లుగా కాలయాపన | - | Sakshi
Sakshi News home page

బీసీ రిజర్వేషన్ల పేరుతో రెండేళ్లుగా కాలయాపన

Aug 16 2026 5:21 AM | Updated on Aug 16 2026 5:21 AM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార

ప్రతినిధి, మాజీ మేయర్‌ బీవై రామయ్య

కర్నూలు(టౌన్‌): మాది బీసీల పార్టీ, అన్ని ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన చంద్రబాబు నాయుడు ఇంకెంత కాలం మోసం చేస్తారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కర్నూలు నగర మాజీ మేయర్‌ బి.వై.రామయ్య ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటిందని, బీసీ రిజర్వేషన్ల పేరుతో రిటైర్డు ముఖ్య కార్యదర్శి రాజీవ్‌ రంజన్‌ మిశ్రా ఆధ్వర్యంలో వేసిన డెడికేషన్‌ కమిటీ వల్ల కాలయాపన తప్ప ఒరిగిందేమిటో ప్రజలకు చెప్పాలన్నారు. శనివారం ఆయన స్థానిక మాజీ మేయర్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పంచాయతీ యాక్టు– 176 ప్రకారం రాష్ట్రంలో బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు అమలు చేసి వారిని బ్యాక్‌వర్డు క్లాస్‌గా కాకుండా బ్యాక్‌బోన్‌గా రాజకీయ పదవుల్లో ప్రత్యేకంగా గుర్తింపునిచ్చారన్నారు. ఓసీలకు కేటాయించిన ప్రాంతాల్లోనూ బీసీలకు సీట్లిచ్చిన ఘనత ఆయనకు మాత్రమే దక్కుతుందన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బీసీ వర్గాలకు చెందిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలను అక్రమ కేసులతో వేధిస్తోందన్నారు. శ్రీకాకుళం మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు నుంచి కర్నూలులో అలూరు ఎమ్మెల్యే విరుపాక్షి వరకు అక్రమ కేసులు పెట్టి జైళ్లలో పెట్టించారన్నారు. చంద్రబాబుకు బీసీలంటే పడదన్నారు. చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు కలిసికట్టుగా సత్తా చాటుతారని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement