● వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి
మద్దూరు సుభాష్ చంద్రబోస్
కర్నూలు (టౌన్): కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులకు బెదిరేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దూరు సుభాష్ చంద్రబోస్ అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక సి. క్యాంపులోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అధికార మదంతో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులపై , కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడం పిరికి పంద చర్య అన్నారు. అక్రమ కేసులతో ప్రజా గళాన్ని అణిచి వేయలేరన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం శాశ్వతం కాదని, చట్టాలను గౌరవించి పోలీసులు నిష్పక్ష పాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు అనుకూలంగా ఎటువంటి నిరసనలు చేసినా పోలీసులు కేసు పెట్టడం లేదన్నారు. శాంతియుతంగా నిరసనలు చేస్తే కేసులు పెట్టడం సమంజసం కాదన్నారు. కర్నూలుకు తలమానికమయిన కొండారెడ్డి బురుజు పైకి వందలాది మంది ఉపాధ్యాయులు కూటమి నేతల ఫ్లెక్సీలతో నిరసనలు చేస్తే వారిపైన పోలీసులు ఎందుకు కేసులు పెట్ట లేదని ప్రశ్నించారు. అదే కొండారెడ్డి బురుజు పైకి ఎక్కి ఉంటే తమపై వెంటనే కేసులు పెట్టేవారన్నారు. ప్రజా వ్యతిరేక పాలనలో కక్ష సాదింపులు, వేధింపులు, అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు అజెండాగా పనిచేస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు.
మంత్రాలయంలో చోరీ
మంత్రాలయం రూరల్: మండల కేంద్రం మంత్రాలయం రామచంద్రనగర్‌లో ఓ ఇంట్లో దొంగలు పడి అందినకాడికి దోచుకెళ్లారు. హెడ్‌కానిస్టేబుల్ మురళీధర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. రామచంద్రనగర్‌లో నివసించే సి. వెంకటేష్‌కు నెలరోజుల నుంచి ఆరోగ్యం బాగా లేకపోవడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ఇంటి వద్ద ఉన్న కుమారుడు అనిల్ సైతం ఈనెల 8న ఇంటికి తాళం వేసి తండ్రి వద్దకెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంట్లో చొరబడి ల్యాప్‌ట్యాప్ ,ఒన్‌ప్లస్ టీవీ, 20 తులాల వెండి పట్టీలు, 10,000 నగదు, బంగారు కమ్మలు ఎత్తుకెళ్లారు. ఈనెల 15న ఇంటికి రాగా తాళం చెవి తెరిచి ఉంది. అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. చోరీ జరిగిందని నిర్ధారించుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


