ఎల్లెల్సీలో నీటి ప్రవాహానికి అడ్డుకట్ట | - | Sakshi
Sakshi News home page

ఎల్లెల్సీలో నీటి ప్రవాహానికి అడ్డుకట్ట

Aug 16 2026 5:21 AM | Updated on Aug 16 2026 5:21 AM

టీబీ డ్యాంలో నీరున్నా జిల్లా రైతులకు తొలగని కష్టాలు

హొళగుంద: కర్ణాటకలోని తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) 155 కి.మీ వద్ద ఇసుక బస్తాలతో శుక్రవారం అడ్డుకట్ట వేయడంతో శనివారం హొళగుంద సెక్షన్‌లో నీటి ప్రవాహం ఆగిపోయింది. ఆంధ్ర కాలువ 250 కి.మీ వద్ద నీటి ప్రవాహం జీరో క్యూసెక్కులకు చేరుకుంది. దీంతో కాలువలో నీరులేక బోసిపోతుండగా ఈ ప్రాంత ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం టీబీ డ్యాంలో 92 టీఎంసీల మేర నీరుండి కర్ణాటక కోటా కింద 650 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. ఆంధ్రా వారి నీటిని తీసుకెళితే తమవాటా కూడా ముందుకు వదులుతామని కాలువలో ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేసిన సంగతి తెలిసిందే. జిల్లా ఇరిగేషన్‌ అధికారులు ఇండెంట్‌ ఇవ్వకపోవడంతో కేవలం కర్ణాటక నీరు మాత్రమే కాలువలో ప్రవహిస్తున్నాయి. కాలువలో ఆంధ్ర కోటా నీరు కూడా చేరితే పూర్తిస్థాయిలో నీరు పారుతూ వరి, ఇతర పంటలను సాగు చేసు కోవచ్చని కర్ణాటక రైతులు భావించారు. తక్కువ నీరు పారుతుండడంతో ఏపీ తీరు ఇందుకు కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు. జలాశయంలో పూర్తిస్థాయిలో నీరు చేరుతున్నా తాము పంటల సాగుకు నోచుకోలేక పోతున్నామని రైతులు వాపోతున్నారు. ఇలాంటి సమయంలో కాలువలో వచ్చే నీరు కూడా ఆగిపోవడంతో మున్ముందు ఎలాంటి పరిస్థితికి దారి తీస్తుందోనని తీవ్ర ఇందోళనకు గురవుతున్నారు. దీనిపై పాలకులు, జిల్లా కలెక్టర్‌, ఇరిగేషన్‌ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. కాగా.. శనివారం టీబీ డ్యాం పూర్తి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా శనివారం 92.5 టీఎంసీల నీరు నిల్వ ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement