రైలెక్కుతున్న కూలీలు
కోసిగి: రోజు వారీ కూలీలు పని కోసం అన్వేషిస్తూ బతుకు పోరు సాగిస్తున్నారు. ఉదయాన్నే రైలులో బయలుదేరి ఇతర ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకుని రాత్రికి స్వగ్రామానికి చేరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వెళ్లిన చోట పనులు దొరక్కపోతే మధ్యలో మరో రైలు పట్టుకుని కడుపు మాడ్చుకుని ఇంటికి చేరుకోవాల్సిన దుస్థితి. కోసిగి మండలంలోని కోసిగి, నేలకోసిగి, వందగల్లు, డి.బెళగల్, గౌడుగల్లు, జుమ్మాలదిన్నె, భూంపల్లి, గ్రామాలతో పాటు కౌతాళం మండలం కరణి, చిరుతపల్లి గ్రామాల నుంచి దాదాపు 600 నుంచి 700 మంది కూలీలు రోజు ఉదయం 7 గంటలకంతా కోసిగి రైల్వే స్టేషన్ చేరుకుంటారు. కోసిగి నుంచి తుంగభద్ర, మఠమారి, రాయచూరు, కృష్ణ, సైదాపూర్ వరకు రైలులో ప్రయాణం సాగించి ఆయా ప్రాంతాల్లో పని వెతుక్కుంటారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో పత్తి పొలాల్లో కలుపు మొక్కలు ఏరేందుకు వెళుతున్నారు. మగవారితో పాటు మహిళలు కూడా రోజూ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎకరం పొలంలో కలుపు తీసేందుకు రూ.2 వేలు చొప్పున ఇస్తున్నట్లు కూలీలు చెబుతున్నారు. మండలంలో వర్షాలు లేక పంటలు అంతంత మాత్రమే ఉన్నాయని, ఇక్కడ పనులు దొరక్క ఇతర ప్రాంతాలకు పనులకు వెళుతున్నట్లు కూలీలు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న వీబీ జీ రాంజీ పనులు గిట్టుబాటు కావడం లేదని ఆరోపించారు.


